టీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలి ఏడాది అత్యంత ఆకర్షణీయంగా ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ల పథకానికి అవినీతి చెదలు పట్టింది. పథకం అమలు చేసేందుకు
నల్లగొండ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలి ఏడాది అత్యంత ఆకర్షణీయంగా ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ల పథకానికి అవినీతి చెదలు పట్టింది. పథకం అమలు చేసేందుకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయి ఉద్యోగుల నిర్వాహకం వల్ల పింఛన్ల సొమ్ము పక్కదారి పట్టింది. స్థానిక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పంచాయతీ కార్యదర్శులు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో తప్పులో కాలేశారు. దీంతో పథకం ప్రారంభమైన నాటి నుంచి ప్రతి నెలా వేల రూపాయాల పింఛన్ల సొమ్ము అనర్హుల ఖాతాల్లోకి వెళ్లిపోయింది. లబ్ధిదారుల వేలిముద్రల సాయంతోనే బయోమెట్రిక్ ద్వారా పింఛన్ డబ్బులు చెల్లిస్తున్నా అక్రమాలను ఆపలేకపోయా రు.
గతేడాది నవంబర్ నుంచి ఆసరా పింఛన్ల పథకం ప్రారంభంకాగా...నాటి నుంచి ఈ ఏడాది మే చివరి వరకు పంపిణీ చేసిన పింఛన్ల పై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సామాజిక తనిఖీ నిర్వహించింది. తొలి దశ సామాజిక తనిఖీ పీఏపల్లి, సూర్యాపేట, నార్కట్‌పల్లి, చౌటుప్పుల్ మం డలాల పరిధిలోని గ్రామాల్లో నిర్వహించారు. ఈ ఏడు మా సాల కాలంలో ఆయా గ్రామాల్లో జరిగిన చెల్లింపుల వివరాల ఆధారంగా సామాజిక తనిఖీ చేశారు. వివిధ వర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించారు. ఈ నాలుగు మండలాల్లో రూ.5 1,40,340 దుర్వినియోగం అయినట్లు తేల్చారు. 1289 మంది నుంచి అభ్యంతరాలు స్వీకరించారు.
అర్హతలేని వ్యక్తులకే అధిక చెల్లింపులు...
నాలుగు మండలాల్లో జరిగిన పింఛన్ చెల్లింపుల్లో అత్యధికంగా అర్హతలేని వ్యక్తులకే అందాయి. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయ భూములు, ఆదాయ పరిమితికి మించిన వ్యక్తులకే పింఛన్లు చెల్లించారు. ఈ కేటగిరీలో రూ.38.73 లక్షలు దుర్వినియోగం అయినట్లు తేలింది. రెండో కేటగిరీలో పింఛన్ పొందేందుకు వయోపరిమితి లేని వ్యక్తులకు పంపిణీ చేస్తూ వచ్చారు. నిబంధనల మేరకు వృద్ధులకు 65 ఏళ్లు, చేనేత, కల్లుగీత కార్మికులకు 50 ఏళ్లు దాటిన వ్యక్తులకు మాత్రమే చెల్లించాలి. కానీ అలాకుండా అంతకంటే తక్కువ వయసు కలిగిన వ్యక్తులను ఆసరా జాబితాలో చేర్చడం ద్వారా రూ.4.34 లక్షలు దుర్వినియోగమయ్యాయి. భర్త వదిలేసిన మహిళ లు, ఒంటరి మహిళల పేరుతో రూ.3.72 లక్షలు స్వాహా చేశారు. చని పోయిన వ్యక్తుల పేరుతో వారితాలూకు బంధువులు ప్రతి నెలా పింఛన్ పొందుతున్నారు. ఈ కేటగిరీలో లక్ష రూపాయాలు, బోగస్ లబ్ధిదారుల పేరుమీద డబుల్ పింఛన్లు రూ.రెండు లక్షలు చెల్లించారు. పింఛన్‌దారులకు అసలు చెల్లించకుండా మధ్యవర్తులే కాజేసిన సొమ్ము రూ .67,900. ఇదిలాఉంటే బ్రాంచి పోస్టు మాస్టర్లు, పంచాయతీ కార్యదర్శులు కలిసి గుర్తుతెలియని వ్యక్తుల పేర్లతో రూ.76,500లు కాజేసినట్లు తనిఖీలో తేలింది.
వారిద్దరే కీలకం...
క్షేత్రస్థాయిలో పింఛన్ల పంపిణీకి పూర్తి బాధ్యత వహించాల్సింది బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, పంచాయతీ కార్యదర్శులే. కానీ వారి ప్రమేయంతోనే పింఛన్లలో అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీలో ఫిర్యాదులు వచ్చాయి. పీఏపల్లి మండలంలో కార్యదర్శుల ప్రమేయం నేరుగా ఉన్నట్లు నిర్ధారించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్య ఎవరిపైనా తీసుకోలేదు.
రికవరీ నిల్...
దుర్వినియోగం అయిన పింఛన్ల సొమ్ము ఎవరి నుంచి తిరిగి రాబట్టాలో కూడా అధికారులకు స్పష్టంగా తెలియడం లేదు. పంచాయతీ కార్యదర్శులను, పోస్టుమాస్టర్లను బాధ్యుల్ని చేసే ప్రయత్నం చేసినాగానీ ఫలితం కనిపించడం లేదు. లబ్ధిదారుల నుంచే ఆ సొమ్ముంతా రాబట్టాలని సెర్ప్ ఖాతా పేరుమీద చాలానా తీయాలని డీఆర్‌డీఏ నుంచి క్షేత్రస్థాయికి ఆదేశాలు వెళ్లాయి కానీ ఇప్పటి వరకు నయాపైసా రికవరీ లేదు. ఆడిట్ పూర్తయి రోజులు గడుస్తున్నా పోయిన సొమ్ము తిరిగిరాబట్టడంలో అధికారులు చర్యలు వేగవంతం చేయలేకపోతున్నారు. ఇదిలాఉంటే ప్రస్తుతానికి జిల్లాలో సామాజిక తనిఖీకి తాత్కాలిక విరామం ఇవ్వాలని సెర్ప్ నుంచి ఆదేశాలు రావడంతో నిలిపేశారు.