సాక్షి, సిటీబ్యూరో: జలమండలి పుట్టి ముంచుతోన్న ఇంటి దొంగల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతుండడం సంచలనం సృష్టిస్తోంది. వాటర్‌బోర్డుకు రూ. కోట్లలో నష్టం చేసిన ఓ క్షేత్రస్థాయి అధికారి..తనకున్న అధికారాలతో ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 1.97 లక్షల రూపాయల నీటిబిల్లు మాఫీ చేసి వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బోర్డు ఉన్నతాధికారులు సదరు అధికారిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జలమండలిలో మాదాపూర్ సెక్షన్ పరిధిలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న కె.రవీందర్ 2015–18 మధ్యకాలంలో తనకున్న అధికారాలతో 381 నల్లా కనెక్షన్లకు సంబంధించిన నీటిబిల్లు రూ.1,96,71,398 బకాయిలను మాఫీచేసి సదరు వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకొని బోర్డుకు భారీగా నష్టం చేసినట్లు బోర్డు విజిలెన్స్ బృందం పరిశీలనలో తేలింది. దీంతో ఆయనను బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ సోమవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. అతనిపై బోర్డు నిబంధనలు, సర్వీసు మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తక్షణం సదరు అధికారి తన గుర్తింపు కార్డును సంబంధిత డివిజన్ జనరల్ మేనేజర్‌కు అప్పగించాలని, తదుపరి ఆదేశాలిచ్చేవరకు నగరం విడిచి వెళ్లరాదని స్పష్టంచేశారు.
జలమండలిలోఇంటిదొంగల నిర్వాకమిదీ..
జలమండలి నెట్‌వర్క్ ఔటర్‌రింగ్‌రోడ్డు పరిధి వరకు విస్తరించడం..ప్రస్తుతం ఉన్న 9.65 లక్షల నల్లా కనెక్షన్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో వినియోగదారులకు అవస్థలు లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లు, డిప్యూటీ జనరల్‌మేనేజర్లు, జనరల్ మేనేజర్లకు పలు అధికారాలను బోర్డు బదలాయించింది. ఇదే అదనుగా కొందరు జలగల్లా మారిన అధికారులు వినియోగదారుల వాణిజ్య నల్లాలను తమ అధికారాలను వినియోగించుకొని గృహ వినియోగ నల్లాలుగా మార్చేస్తున్నారు. బోర్డు డేటాబేస్‌లో ఇలాంటి మార్పులు చేస్తుండడంతో నెలవారీగా వేలల్లో వసూలు చేయాల్సిన బిల్లు వందల్లోపే ఉంటుంది. తాజాగా సస్పెన్షన్ వేటు పడిన అధికారి ఏకంగా తన పాస్‌వర్డ్‌ను వినియోగించుకొని వేలాదిగా నీటిబిల్లు బకాయిపడిన 381 మంది వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకొని ఏకంగా రూ.1.97 కోట్ల రూపాయల నీటిబిల్లు బకాయిలను బోర్డు డేటాబేస్‌నుంచి తొలగించడం సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి ఉదంతాలు బోర్డు విజిలెన్స్ పోలీసులు లోతైన విచారణలో రోజుకొక్కటి చొప్పున బయటపడుతుండడం గమనార్హం. ఇటీవల చంచల్‌గూడా సెక్షన్ పరిధిలో మాజీ ఉద్యోగి పాస్‌వర్డ్‌ను వినియోగించుకొని పలు వాణిజ్య నల్లాలను గృహవినియోగ నల్లాలుగా మార్చిన అక్రమార్కుల ఉదంతం బయటపడడంతో విజిలెన్స్ పోలీసులు కేసులు నమోదుచేసిన విషయం విదితమే.
ప్రధానంగా అపార్ట్‌మెంట్లు, కాంప్లెక్సులు, బహుళ భవనాలు, హాస్టళ్లు, హోటళ్లు, ఆసుపత్రులు, రెస్టారెంట్లకు సాధారణంగా వాణిజ్య నల్లాలుగా పరిగణిస్తారు. వీటిని గృహవినియోగ నల్లాలుగా బోర్డు డేటాబేస్‌లో మార్పులు చేస్తుండడంతో వాటి నుంచి రావాల్సిన కనెక్షన్ ఛార్జీలు, నీటిబిల్లులు రాక బోర్డుకు ప్రతీనెలా కోట్లరూపాయల నష్టం వాటిల్లుతోంది.
ఇప్పటికే నెలకు సుమారు రూ.25 కోట్ల ఆర్థికనష్టాలతో ఉన్న బోర్డుకు కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వాకంతో మరింత కుదేలవుతోంది. మహానగరం పరిధిలో సుమారు లక్ష వరకు అక్రమ నల్లాలుంటాయని బోర్డు వర్గాల్లో బహిరంగ రహస్యమే. ఇవి ఎక్కడున్నాయన్న విషయం అధికారులు, సిబ్బందికి తెలిసినా మిన్నకుంటున్నారంటే వీటి ఏర్పాటు వెనక సూత్రధారులు వీరేనన్న విషయం సుస్పష్టమౌతోంది. జలమండలిలో జలగల ఉదంతంతో ప్రతీనెలా బోర్డు రూ.10 కోట్లమేర కనెక్షన్ ఛార్జీలు, నీటిబిల్లు బకాయిలు, నీటిచౌర్యం, అక్రమనల్లాల కారణంగా నష్టపోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తుండడం గమనార్హం. కాగా జలమండలిలో క్షేత్రస్థాయి అధికారుల వ్యవహారాలను ఎండీ ఎం.దానకిశోర్ సీరియస్‌గా తీసుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, సిబ్బందిపై విజిలెన్స్ బృందం ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. నీటినాణ్యత, వినియోగదారుల సమస్యల పరిష్కారం విషయంలో ఐఎస్‌ఓ ధ్రువీకరణ సాధించిన బోర్డుకు కొందరు అధికారుల తీరు శాపంగా పరిణమిస్తుండడంతో సదరు అక్రమార్కుల భరతం పట్టాలని నిర్ణయించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment