సాక్షి, రంగారెడ్డి జిల్లా : మొక్కజొన్న పంట బీమాపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. వాస్తవానికి జులై నెలాఖరు నాటికి బీమాకు సంబంధించి ప్రీమియం చెల్లింపు గడువు ముగిసింది. అయితే సర్కారు వైఖరితో జిల్లా రైతాంగం ప్రీమియం చెల్లింపునకు నోచుకోలేదు. తాజాగా తేరుకున్న జిల్లా వ్యవసాయ శాఖ.. బీమా చెల్లించేం దుకు రైతులకు గడువు ఇవ్వాలంటూ బీమా సంస్థకు లిఖితపూర్వకంగా కోరినప్పటికీ ఈ అంశంపై స్పష్టత రాకపోవడంతో రైతుల చివరి ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి కనిపిస్తోంది.
వారంలో తేలకుంటే అంతేసంగతి..
సాధారణంగా పంటబీమాకు సంబంధించి ప్రతి రైతు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం పొందే రైతులకుగాను నేరుగా వారి బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం డబ్బులు కోత పెట్టి మిగతా రుణాన్ని రైతుకు ఇస్తారు. కానీ బ్యాంకు రుణం పొందని రైతులు మాత్రం నేరుగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జులై31 నాటితో గడువు ముగిసింది.
జిల్లాలో మొక్కజొన్న పంటబీమాపై ప్రభుత్వం ఇప్పటికీ ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో అధికారుల్లో గందరగోళం నెలకొంది. ఫలితంగా ప్రీమియంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో జిల్లా రైతులు ప్రీమియం చెల్లించలేకపోయారు. ఇటీవల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ ఈ అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో చర్యలకు దిగిన జిల్లా వ్యవసాయశాఖ ఇన్యూరెన్స్ సంస్థకు లిఖితపూర్వకంగా పరిస్థితిని వివరించారు.
స్పందన కరువు..
జిల్లాలో గతేడాది మొక్కజొన్న కు సంబంధించి రెండువేల మంది రైతులు బీమాకు దరఖాస్తు చేసుకుని ప్రీమియం చెల్లించారు. అదేవిధంగా బ్యాంకు రుణాలు పొందిన రైతుల కేటగిరీలో పెద్ద సంఖ్యలో బీమా ప్రీమియం చెల్లించారు. తాజాగా ప్రభుత్వం బీమాకు సంబంధించిన ఉత్తర్వులివ్వకపోవడంతో రైతులు ప్రీమియం చెల్లించలేదు. మరోవైపు బీమా సంస్థకు లిఖిత పూర్వకంగా లేఖ రాసినా స్పందన కరువైంది.
ప్రస్తుతం జిల్లాలో 30వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగవుతోంది. తాజాగా నెలకొన్న కరువు పరిస్థితులతో పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులకు బీమాకు అర్హులైతే నష్టం వచ్చినా కొంతైనా లబ్ధి చేకూరేది. కానీ బీమాపట్ల స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది.
బీమా లేనట్టే!
Published Sun, Aug 10 2014 12:45 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement