గ‘లీజు’ దందా.. | cotton purchase as private in ginning mill | Sakshi
Sakshi News home page

గ‘లీజు’ దందా..

Published Sat, Nov 22 2014 2:51 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

cotton purchase as private in ginning mill

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిన్నింగ్ మిల్లుల్లో జిమ్మిక్కులు జరుగుతున్నాయి. సీసీఐ ఉన్నతాధికారులు, బడా పత్తి వ్యాపారులు కుమ్మక్కై పత్తి రైతును నిండా ముంచుతున్నారు. తమ జిన్నింగ్ మిల్లులను సీసీఐకి లీజుకు ఇచ్చి ఒకవైపు రూ.లక్షల్లో జిన్నింగ్, ప్రెసింగ్ చార్జీలను పొందుతూనే.. మరోవైపు అదే జిన్నింగ్ మిల్లుల్లో అక్రమంగా రైతుల వద్ద ప్రైవేటుగా పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇలా రైతుల నుంచి తక్కువ ధరకు
 కొనుగోలు చేసిన పత్తిని కనీస మద్దతు ధర చొప్పున సీసీఐ ఖాతాలో వేసి నిత్యం రూ.లక్షలు దండుకుంటున్నారు.

బహిరంగంగానే ఈ దందా కొనసాగుతునన్నా సంబంధిత శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడ్డం లేదు. నిబంధనల ప్రకారం సీసీఐకి లీజుకిచ్చిన మిల్లుల్లో ప్రైవేటుగా పత్తి వ్యాపారం చేయరాదు. మిల్లును లీజుకు తీసుకున్నందుకు గాను సీసీఐ ఆ యజమానికి రూ.లక్షల్లో చార్జీలను చెల్లిస్తుంది. దీంతో సంతృప్తి చెందని కొందరు బడా పత్తి వ్యాపారులు ఈ అక్రమ దందాకు తెరలేపారు. సీసీఐ అధికారులతో జతకట్టి రూ.లక్షల్లో దండుకుంటున్నారు. ఈ వ్యవహారంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

 కలెక్టర్‌కు ఫిర్యాదు
 ఈ కొనుగోలు సీజనులో సీసీఐ ఆదిలాబాద్ జిల్లా శాఖ పరిధిలో 21 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్, ప్రెసింగ్ చేయించి బేళ్లుగా తయారు చేస్తుంది. ఇలా తయారైన బేళ్లను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తుంది. ఇందుకోసం ఈ సీజన్‌లో జిల్లాలో 44 జిన్నింగ్ మిల్లులను సీసీఐ లీజుకు తీసుకుంది. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 14 జిన్నింగ్ మిల్లులను లీజుకు తీసుకోగా, భైంసాలో నాలుగు మిల్లులతో ఒప్పందం చేసుకుంది.

 ఆసిఫాబాద్, లక్సెట్టిపేట, మంచిర్యాల, బోథ్, చెన్నూర్‌లో మూడేసి చొప్పున, నేరడిగొండలోని రెండు మిల్లులను మిగితా చోట్ల ఒక్కో జిన్నింగ్ మిల్లు చొప్పున లీజుకు తీసుకుంది. సీసీఐకి లీజుకు ఇచ్చిన యజమానులు ఆ మిల్లుల్లో ఎలాంటి పత్తి కొనుగోళ్లు చేపట్టరాదు. కానీ.. కొందరు యజమానులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల కొందరు రైతులు జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.

 చక్రం తిప్పుతున్న బడా వ్యాపారి
 ఈ అక్రమాల్లో ఆరితేరిన ఓ బడా వ్యాపారి దందాను వెనకుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమ దందా చేస్తున్న పత్తి వ్యాపారులకు నాయకుడిగా చెలామణి అవుతున్న ఈయన వాణిజ్య పన్నులు, రెవెన్యూ, తూనికల కొలతలు, మార్కెటింగ్ శాఖల్లోని కీలక అధికారులకు సీజన్ వారీగా పెద్ద మొత్తంలో మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం.

ఒక్కో శాఖలో అధికారి స్థాయిని బట్టి ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. మొత్తం మీదా తమ కష్టాన్ని అందరూ కలిసి పంచుకుంటున్నారని పత్తి రైతులు వాపోతున్నారు. ఇకనైనా సీసీఐ విజిలెన్స్ విభాగం ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అక్రమార్కులపై నిఘా పెట్టి.. సీబీఐ వంటి ఉన్నత సంస్థలు ఈ అక్రమాలపై దృష్టి సారించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement