సాక్షి, హైదరాబాద్: శాసన మండలి సమావేశాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాల నిర్వహణపై శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుందని.. సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సమాచారమిచ్చారు. శాసనసభ రద్దయిన నేపథ్యంలో శాసనమండలి సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు చివరిసారిగా మార్చి 29న జరిగాయి. ఆరునెలల్లోపు కచ్చితంగా సమావేశాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ షెడ్యూల్ ఖరారైంది.
27న స్పష్టత..: శాసనసభ రద్దయి.. శాసనమండలి సమావేశాలు మాత్రం జరుగుతుండటం అరుదైన అంశంగా చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని సీనియర్ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. శాసన మండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈ నెల 27న స్పష్టత రానుంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న మండలి సమావేశాల నిర్వహణపై ఆసక్తి నెలకొంది.
ప్రచారానికి వారం విరామం...
మండలి సమావేశాల నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మరో వారం వాయిదా పడనున్నాయి. సెప్టెంబర్ 7న హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలు ప్రచారాన్ని ప్రారంభించారు. 50 రోజుల్లో వంద బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి ముందుగా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచార బహిరంగసభల నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 25 తర్వాత వరుసగా సభలను నిర్వహించాలనుకున్నారు. మండలి సమావేశాలున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార షెడ్యూల్ మరో వారం వాయిదా పడనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
27 నుంచి మండలి సమావేశాలు
Published Sat, Sep 22 2018 2:35 AM | Last Updated on Sat, Sep 22 2018 2:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment