
రాజేంద్రనగర్: మహిళలు, చిన్నారులు, యువతులపై రోజురోజుకూ పెరుగుతున్న అఘాయిత్యాలతో అతడి మనసు చలించింది. రాత్రి సమయాల్లో ఉద్యోగాలు, కళాశాలలు, ఇతర పనుల మీద వస్తున్న వారి భద్రత కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భార్యతో చర్చించి పర్యావరణానికి హాని కలగని ఈ– ఆటోలను సమకూర్చుకున్నాడు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేయడానికి ఓ యాప్‌ను రూపొందించాడు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ అభ్యుదయనగర్ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగుల నరేందర్, స్రవంతి దంపతులు గతంలో పంచాయతీ వార్డు సభ్యులుగా పనిచేశారు. బండ్లగూడ జాగీర్ గ్రామంలోని 30 కాలనీలవాసులు ఉద్యోగాలు, కళాశాలలు, పాఠశాలలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. ఈ ప్రాంతంలో బస్సు సౌకర్యం ఎక్కువగా లేకపోవడంతో పాటు అంతర్గత కాలనీలకు ఆటోల సౌకర్యం అసలే లేదు.
దీంతో రాత్రి సమయాల్లో మహిళలు, పురుషులు, విద్యార్థినులు, వికలాంగులు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి నరేందర్ దంపతులు ఓ మార్గం కనుగొన్నారు. ఢిల్లీలో ఈ– ఆటోలు దొరుకుతాయని తెలుసుకొని వాటి గురించి వాకబు చేశారు. మొదట రూ.2.5 లక్షలు వెచ్చించి ఓ ఆటోను కొనుగోలు చేసి కొన్నిరోజుల క్రితం ప్రారంభించారు. మంచి స్పందన రావడంతో మరో 4 ఆటోలను కొనుగోలు చేసి ప్రారంభించారు. ప్రస్తుతం ఐదు ఆటోల్లో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ప్రయాణికులు ఇస్తే రూ. 5 లేదంటే ఉచితంగా సేవ చేస్తున్నారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ– ఆటోలు అందుబాటులో ఉంటాయి.
మొదటిసారి యాప్ ద్వారా..
ప్రతి ప్రయాణికుడు రోడ్లపై ఈ– ఆటోల కోసం నిరీక్షించడం సరికాదని భావించిన నరేందర్ తన స్నేహితులతో ‘గణపతి ఎక్స్‌ప్రెస్’ పేరిట యాప్‌ను రూపొందించాడు. ఈ యాప్‌ను ఓపెన్ చేయగానే ఐదు ఆటోల వివరాల ఆప్షన్ వస్తుంది. తాము ఏ రూట్‌లో వెళ్లాలో నిర్ణయించుకొని దానిపై క్లిక్ చేయగానే ఆటో అక్కడికి వస్తుంది. జీపీఎస్ సౌకర్యం ఉండడంతో ఈ యాప్ ద్వారా ఆటో ఎక్కడ ఉంది, ఎంత సమయంలో చేరుతుంది తదితర వివరాలు వస్తాయి. అంతేకాకుండా ప్యాసింజర్లు ఎంతమంది ఉన్నారు.. ఖాళీ సీట్లు ఎన్ని ఉన్నాయి అందులో కనిపిస్తుంది. ఫోన్‌నంబర్ సైతం ఉండడంతో డ్రైవర్‌తో నేరుగా మాట్లాడవచ్చు.
భద్రతకు ప్రథమ ప్రాధాన్యం..
ఈ– ఆటోల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. జీపీఎస్ కూడా ఉండడంతో ప్రయాణికులకు పూర్తి భద్రత ఉంటుంది. ఆటోలో ఎవరెవరు ప్రయాణిస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. ఆటో డ్రైవర్ ఆయా గమ్యస్థానాల్లో ప్రయాణికులను దింపుతున్నాడా.. వారి నుంచి ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నాడా..? తదితర అంశాలను ఎప్పటికప్పుడు నరేందర్ పరిశీలించవచ్చు. సీసీ కెమెరా బ్యాకప్ 15 రోజులు ఉంటుంది.
రోగుల సేవకు..
ప్రస్తుతం ఐదు ఆటోల ద్వారా సేవలందిస్తున్న నరేందర్ ఇందులో ఇంటి వద్ద నుంచి రోగులను తీసుకువెళ్లేదుకు ఓ ఆటోను ఏర్పాటు చేశాడు. 24 గంటల పాటు సేవలు అందించే ఈ వాహనాన్ని అత్యవసర సమయాలకు వినియోగిస్తున్నాడు. ఆస్పత్రులకు వెళ్లే వారు యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే వచ్చి తీసుకువెళ్లి తిరిగి తీసుకొచ్చే బాధ్యత డ్రైవర్‌దే. ఇందుకోసం రెండుసార్లకైతే (రానుపోను) రూ. 20 నామమాత్రంగా వసూలు చేస్తున్నారు. ఒకసారికి అయితే పూర్తిగా ఉచితం.
పూర్తిగా పర్యావరణహితం
పర్యావరణ పరిరక్షణ కోసం నరేందర్ ఈ– ఆటోలను కొనుగోలు చేశారు. నిత్యం 8 గంటల పాటు చార్జీ చేస్తే 80 కి.మీ దూరం ప్రయాణిస్తాయి. ఆటోలకు సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేశాడు. దీంతో అదనంగా మరో 40 కిమీ నిత్యం తిరుగుతున్నాయి. మొత్తమ్మీద ఒక్కో ఆటో రోజూ 120 కి.మీ తిరుగుతోంది.
ఆదివారం సెలవు..
ఈ– ఆటోలకు ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు ఉపశమనం ఉండడంతో పాటు ఆదివారం కళాశాలలు, కార్యాలయాలు, పాఠశాలలు బంద్ ఉండడంతో ఇబ్బందులు ఉండవని సెలవును ఏర్పాటు చేసినట్లు నరేందర్ వెల్లడించాడు. ప్రభుత్వ, పండగ సెలవు దినాల్లో కూడా ఆటోలు అందుబాటులో ఉండవని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment