
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ (కరోనా) వైరస్ దెబ్బకు అన్ని శాఖలతో పాటు జైళ్ల శాఖ కూడా అప్రమత్తమైంది. వందలాది మంది ఒకేచోట ఉండే ప్రాంతం కావడంతో వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు జైళ్ల శాఖ ఖైదీల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర (చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్) కారాగారాలు, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా కారాగారాలకు జారీ చేసింది. ముఖ్యంగా కోర్టు విచారణలకు వెళ్లి వచ్చే ఖైదీలకు ప్రత్యేకంగా మాస్కులు ఇస్తోంది. ఇటు ఖైదీతో పాటు వచ్చే ఎస్కార్టు సిబ్బందికీ మాస్కులు ఇస్తున్నారు.
(చదవండి: వ్యక్తిగత పరిశుభ్రతతోనే వైరస్‌కు చెక్)
కోర్టు వాయిదా అనంతరం వారిని నేరుగా జైలులోకి రానీయడం లేదు. వారికి ప్రత్యేకంగా సబ్బు ఇచ్చి, స్నానం చేసి, దుస్తులు మార్చుకున్నాకే లోపలికి అనుమతిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోయినా.. విపరీతమైన జ్వరం, విడవని జలుబు వంటి కోవిడ్ లక్షణాలను గుర్తించేందుకు జైలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అలాంటి లక్షణాలు ఇంతవరకూ ఏ ఖైదీలోనూ బయటపడనప్పటికీ.. ఒకవేళ వెలుగుచూస్తే.. వారిని వరంగల్ ఎంజీఎం లేదా గాంధీ ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు ముందే సిద్ధం చేసి ఉంచారు.
(చదవండి: ‘వైరస్’ మోసుకొస్తున్నారు!)
Comments
Please login to add a commentAdd a comment