- నిజమైన దేశ భక్తులం మేమే
- బి.జె.పి కార్పొరేట్ల కోసం పని చేసే పార్టీ
- దేశాన్ని కాషాయీకరణ చేయడమే భాజపా లక్ష్యం
- వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థులను జాతి ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు
- సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ధ్వజం
హైదరాబాద్ : 'ఈ దేశం ఎవడబ్బ సొత్తు.. స్వాతంత్ర పోరాటం చేసింది మా పార్టీయే, తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేశారు, నిజమైన దేశ భక్తులం మేమే' అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయం మఖ్దూమ్ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. బ్రిటిష్ తొత్తులను పార్టీలో చేర్చుకున్న చరిత్ర బీజేపీదని విమర్శించారు. స్వాతంత్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ ఎన్నడైనా పాల్గొందా అని ప్రశ్నించారు.
జర్మనీ నియంత హిట్లర్ స్వస్తిక్ గుర్తుతో సంఘ పరివార్ పని చేస్తోంది. ప్రధాని తన ప్రభుత్వాన్ని దింపడానికి కుట్రలు చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోదీ చాయ్ వాలా కాదు..చాయ్ హోటల్ యజమాని కొడుకు అని చెప్పారు. బీజేపీ కార్పొరేట్ల కోసం పని చేసే పార్టీ, వీరికి రూ.10 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చారని విమర్శించారు. అస్సాంలో కుట్ర చేసి ప్రభుత్వాన్ని దింపింది బీజేపీయేనని, మత పరమైన విభజనతో అధికారంలోకి వచ్చి దేశాన్ని కాషాయీకరణ చేస్తోందని సురవరం ఆరోపించారు.
జేఎన్‌యూలో జాతి వ్యతిరేక వ్యాఖ్యల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారన్నారు. జేఎన్‌యూ విద్యార్థులను మొత్తం జాతి ద్రోహులుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని, బీజేపీ మరో ఐదేళ్లు అధికారంలో ఉండాలంటే ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని హితవు పలికారు. 30 శాతం ఓట్లు తెచ్చుకుని 70 శాతం ప్రజల మీద స్వారీ చేయాలంటే కుదరదని స్పష్టం చేశారు. మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామన్నారు.
10 నుంచి 11 బహిష్కృత విద్యార్థి సంఘాల నేతలు చేసిన నినాదాలు వామపక్ష విద్యార్థుల మీద రుద్దడం దారుణమన్నారు. సమాచార కమిషనర్‌గా పదోన్నతి పొందడం కోసమే ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టి సర్కార్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మా పార్టీ విద్యార్థి సంఘం నేతలు బయట తిరగలేని అభద్రతా వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించిందన్నారు. అఫ్జల్ గురు సంతాప సభ కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాలు నిర్వహించలేదని తెలిపారు.
నినాదాలు చేసినవారు ఎవరో సర్కారు గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. మరాఠాలు, జాట్లు, కాపులకు రిజర్వేషన్ల కోసం డిమాండ్లు వస్తున్నాయి. ఉద్యోగ, విద్యా విధానాల్లో సర్కారు సరైన అవకాశాలు కల్పించకపోవడం వల్లనే ఇలాంటి డిమాండ్లు పుట్టుకొస్తున్నాయని ఆయన విమర్శించారు.
'ఈ దేశం ఎవడబ్బ సొత్తు?'
Published Mon, Feb 22 2016 6:29 PM | Last Updated on Mon, Aug 13 2018 8:32 PM
Advertisement
Advertisement