
వర్గ పోరాటాలు చేస్తాం
- ‘సాక్షి’ ఇంటర్వ్యూలోసీపీఐ సారథి సురవరం
- సంక్షోభంలో ఉన్నా ఎదుగుతాం
- మతతత్వ శక్తుల ఆట కట్టిస్తాం
- అటడుగు వర్గాల సమస్యలే ప్రధానం
- రేపటి నుంచి సీపీఐ జాతీయ మహాసభలు
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయ ముఖ చిత్రంలో వచ్చిన అనూహ్య మార్పులతోపాటు ఆర్థిక, సామాజిక అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను స్వీకరిస్తున్నట్టు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. పాలకుల అండతో పేట్రేగిపోతున్న హిందూ మతోన్మాద శక్తుల ఆట కట్టించడం వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతోనే సాధ్యమవుతుందన్నారు. స్థానిక అవసరాలు, సమస్యలే ప్రాతిపదికగా వర్గ పోరు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. పార్టీ 22వ జాతీయ మహాసభలు బుధవారం నుంచి పుదుచ్ఛేరిలో నిర్వహిస్తున్న సందర్భంగా సురవరం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..
వాస్తవాల్ని ప్రజలకు వివరించలేకే...
వామపక్షాల్లో సంక్షోభం నిజమే. ఇది తాత్కాలికమే. తప్పు చేయడం క్షమాపణలు చెప్పుకోవడం అలవాటేననడంలో వాస్తవం లేదు. ఎన్నికల్లో గెలుపోటముల్ని, ప్రజా ఉద్యమాలను ఒకే గాటన కట్టలేం. ప్రాంతీయ పార్టీలతో, బూర్జువా పార్టీలతో పొత్తులనేవి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సహజం. పొత్తుల వెనకున్న వాస్తవాన్ని ప్రజలకు వివరించడంలో విఫలమయ్యాం. బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక రచయితలు, మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయి. గతానికి భిన్నంగా పాలకవర్గాలే హిందూత్వ శక్తులకు అండగా నిలుస్తున్నాయి. 17, 18వ శతాబ్దాల నాటి భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. దీన్ని నిలువరించకపోతే రచయితలకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సే విగ్రహాలు వాడవాడలా వెలుస్తాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మాపై ఉంది.
కమ్యూనిస్టుల పునరేకీకరణే లక్ష్యం..
కమ్యూనిస్టులు చీలిన నాటికి, నేటికీ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. విభేదాలు తగ్గిపోయాయి. ఐక్య కార్యాచరణ పెరిగింది. కొందరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ప్రజాభీష్టానికి అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణకు సీపీఐ కృషి చేస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. కానీ రాజకీయ అవసరం, కీలకాంశం. అందుకే ప్రజల ముందుంచాం. రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది గనుకే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. భూ సేకరణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌పై గళం విప్పిందే లెఫ్ట్. రైతులకు ఎలా లబ్ధి చేకూరుతుందో చెప్పడానికి బదులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అబద్ధాలు చెబుతున్నారు. గ్రామీణ పరిశ్రమలు వేరు, గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలు పెట్టడం వేరు. రైతులకు పరిహారం ఇవ్వడం చట్టంలో భాగమే. ప్రభుత్వానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే లాభాల్లో వాటా ఇప్పించేలా చూడాలి. అది చెప్పడానికి బదులు మోదీ ఇతర రాజకీయ పక్షాలపై అహంకారపూరిత దాడి చేస్తున్నారు.
సంక్షోభాలు చాలా చూశాం..
నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో మా పార్టీలోనూ పెత్తందారి ధోరణి, ముఠాతత్వం, అహంకారం ప్రబలాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకు కొందరు తెలివిగా సైద్ధాంతిక, రాజకీయ ఎత్తుగడలను వాడుకుంటున్నారు. వీటిని ఇకపై సహించం. పార్టీలోకి చొరబడే అన్యవర్గ ధోరణులు, క్రమశిక్షణా రాహిత్యంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. దేశంలో కమ్యూనిస్టుల పనైపోయినట్టు, ఇక తిరిగి పుంజుకోవడం అసాధ్యమన్నట్టు కొందరు మాట్లాడుతున్నారు. ఇలాంటి సంక్షోభాలు చాలా చూశాం. కోటి ఆశలు, కొత్త ఆకాంక్షలతో పార్టీని తిరిగి నిర్మిస్తాం. అట్టడగు వర్గాల సమస్యలే ప్రాతిపదికగా పని చేస్తాం. స్థానిక సమస్యలపై పోరా డుతాం. వర్గ పోరాటాలు చేస్తాం. సొంత కాళ్లపై ఎదుగుతాం. మేం ఎదిగినప్పుడే మిగతా పార్టీలు మా మాట వింటాయి. అంతర్మథనంతో పార్టీకి దశాదిశ నిర్దేశించేలా 22వ జాతీయ మహాసభల్ని నిర్వహిస్తాం. ప్రజాసమస్యలకు పరిష్కార మార్గాల ను అన్వేషించడమే ఈ మహాసభల లక్ష్యం.