
లెఫ్ట్ రెడీ... ఇక ఉద్యమించండి
ఇటీవల సీపీఎం ఆధ్వర్యంలో వివిధ సామాజిక ఉద్యమాలు, ఆందోళనలు జోరుగా సాగుతున్నాయి. బీసీ సబ్‌ప్లాన్, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, మైనార్టీల రిజర్వేషన్లు... తాజాగా మద్యం పాలసీ, చీప్‌లిక్కర్లపై వివిధ దశల్లో నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు సీపీఎం నేతలు చేపట్టారు. వీటి వెనక బలమైన కారణంతోపాటూ ఒక రహస్యం కూడా ఉందని ఇతర వామపక్షాల నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. పార్టీ అవసరాలు, కార్యక్రమాలకు పనికి వస్తుందని సీపీఎం ఒక బస్సును సిద్ధంగా ఉంచుకుంది.
ఆయా ముఖ్యమైన సమస్యలు, అంశాలపై ఆందోళనలు లేదా జిల్లా పర్యటనలు చేపట్టేందుకే బస్సును అందుబాటులో పెట్టుకున్నామని సీపీఎం నాయకులు చెబుతున్నారు. తమ పార్టీ పరంగానే కాకుండా ఏదైనా సంయుక్త కార్యాచరణ లేదా ఉమ్మడి ఆందోళనలు నిర్వహించేందుకు ఇతర వామపక్షాల అఖిలపక్షం ఈ బస్సును ఉపయోగించుకోవచ్చునని ఇతర పార్టీలకు ఆఫర్ కూడా ఇచ్చారట... సీపీఎం బస్సు రెడీ... ఉద్యమించడమే తరువాయి.