సీపీఎం ఉభయ రాష్ట్రాల కార్యదర్శివర్గాల భేటీలో కారత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తూనే ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కమిటీలు నిర్ణయించాయి. ఏపీలో ఏర్పడే కొత్త రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవడం నిరుత్సాహాపరచేదే అయినా, మనోస్థైర్యంతో ముందుకు సాగాలని ఏపీ కమిటీ నిర్ణయిం చగా, ఎంఐఎంతో టీఆర్‌ఎస్ చర్చలు జరపడాన్ని తెలంగాణ కమిటీ స్వాగతించింది. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఉభయ రాష్ట్రాల నూతన కార్యదర్శివర్గ సభ్యులను ఉద్దేశించి ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రసంగించారు. దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులను వివరించారు. కేంద్రంలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వ తీరు తెన్నులు యూపీఏ ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ఉండబోవంటూ, మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేం దుకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయమని సూచించారు.
కారత్ ప్రసంగం తర్వాత వేర్వేరుగా భేటీ అయిన కార్యదర్శివర్గాలు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను చర్చించాయి. ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన పరిస్థితులను సమీక్షించాయి. తెలంగాణలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని, ప్రభుత్వంలో చేరమని ఎంఐఎంను టీఆర్‌ఎస్ కోరడం హర్షణీయమని తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎంఐఎంను టీఆర్‌ఎస్ ఆహ్వానిస్తోందంటే ఆ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండబోతోందని అర్థమవుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తామన్నారు. కాగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తనపై చేసిన ఆరోపణలను ఆయన వ్యక్తిగతమైనవిగా భావిస్తున్నట్టు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో చెప్పారు. నారాయణ వ్యాఖ్యలను సీరియస్‌గా పట్టించుకోవడం లేదన్నారు. వామపక్షాల ఐక్యతకు నారాయణ వ్యాఖ్యలు ఆటంకం కాబోవన్నారు.
అభివృద్ధికి సహకారం, సమస్యలపై పోరాటం!
Published Wed, May 21 2014 4:00 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement