'బీజేపీ కూడా బాధ్యతగా వ్యవహరించలేదు'
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును మంగళవారం లోక్సభలో ఆమోదించిన తీరు అప్రజాస్వామికమని సీపీఎం బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించింది. ఆ బిల్లును ఆమోదించే క్రమంలో పార్లమెంట్ నియమ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. ఎప్పుడు ఎడమోహం పెడమోహంగా ఉండే అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం బీజేపీలు బిల్లు ఆమోదం కోసం కుమ్మక్కయ్యారంది.
అధికార కాంగ్రెసే కాదు, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని సీపీఎం పేర్కొంది. బిల్లుపై సభలో చర్చకు బీజేపీ పట్టుబట్టకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. బిల్లు లోక్సభలో ఆమోదించిన తీరు అప్రజాస్వామికమని తెలిపింది. ఆ అప్రజాస్వామికాన్ని ప్రజలు చూడకుండా ప్రభుత్వమే కావాలని ప్రత్యక్ష ప్రసారాలు నిలిపి వేసిందని సీపీఎం ఆరోపించింది.