క్రాస్ ఓటింగ్‌తో ‘కారు’జోరు? | cross betting car sucessful? | Sakshi
Sakshi News home page

క్రాస్ ఓటింగ్‌తో ‘కారు’జోరు?

May 17 2014 1:59 AM | Updated on Sep 2 2017 7:26 AM

రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమారపు సత్యనారాయణ విజయానికి క్రాస్ ఓటింగే కారణమా? పారిశ్రామికప్రాంతంలో ఇప్పుడిదే హాట్‌టాపిక్!

గోదావరిఖని, న్యూస్‌లైన్: రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమారపు సత్యనారాయణ విజయానికి క్రాస్ ఓటింగే కారణమా? పారిశ్రామికప్రాంతంలో ఇప్పుడిదే హాట్‌టాపిక్! పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా జి.వివేక్, ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబర్ సలీంపాషాతోపాటు స్వతంత్రులలో టార్చిలైట్ గుర్తుపై ఎంపీ అభ్యర్థిగా జి.రమ, ఎమ్మెల్యే అభ్యర్థిగా కౌశిక హరి పోటీ చేశారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన తర్వాత మొదట లోక్‌సభ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో చాలా మంది ఓటర్లు మొదట ఎమ్మెల్యే అభ్యర్థి అనుకొని లోక్‌సభ అభ్యర్థికి ఓటు వేశారు.

 ఆ తర్వాత ఎంపీ అభ్యర్థి అనుకొని ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేశారు. రామగుండం అసెంబ్లీ నుంచి టార్చిలైట్ గుర్తుపై పోటీ చేసిన కౌశిక హరికి పడాల్సిన ఓట్లన్నీ లోక్‌సభ నుంచి అదే గుర్తుపై పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి జిన్న రమాదేవికి పడడం దీనికి ఉదాహరణ. ఈమెకు లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గ వర్గాల్లో 9,199 ఓట్లు రాగా, ఇందులో 7,389 ఓట్లు కేవలం రామగుండం నియోజకవర్గంలోనే పడడం గమనార్హం. రామగుండం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసిన కౌశిక హరికి 13,549  ఓట్లు మాత్రమే రావడం క్రాస్‌ఓటింగ్ పుణ్యమే అంటున్నారు.


 ఇదే క్రమంలో టీఆర్‌ఎస్ గాలి ఎక్కువగా ఉండడంతో లోక్‌సభ అభ్యర్థి బాల్క సుమన్‌కు ఓటు వేశామని భావించిన ఓటర్లందరూ అనూహ్యంగా సోమారపు సత్యనారాయణకు ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి ఒక పార్టీకి, లోక్‌సభకు మరో పార్టీకి ఓటు వేయాలనుకున్న వారు కూడా ఈ రకంగానే అయోమయానికి గురైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే సోమారపు సత్యనారాయణకు విజయం వరించినట్లు స్పష్టమవుతోంది. ఓటమిపాలైన కోరుకంటి చందర్, కౌశిక హరిపై ‘అయ్యోపాపం’ అంటూ పలువురు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement