బల్దియాలో ‘స్వచ్ఛతా పక్షం’ | swatchhata program started in baldia | Sakshi
Sakshi News home page

బల్దియాలో ‘స్వచ్ఛతా పక్షం’

Published Tue, May 2 2017 3:43 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

swatchhata program started in baldia

► ఆరోగ్య పరిరక్షణలో మున్సిపల్‌  కార్మికులది కీలక బాధ్యత
► వేతనాల పెంపు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల మంజూరుకు కృషి
► ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ
►  కార్మికులు, ఉద్యోగులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ
►  ఉత్తమ కార్మికులకు ప్రశంసపత్రాలు


కోల్‌సిటీ: రామగుండం బల్దియాలో ‘స్వచ్ఛతా పక్షం’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా రామగుండం నగరపాలక సంస్థలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ఉత్తమ అవార్డులు ప్రదానం చేశారు. సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని నగర మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణతో కలిసి ఆర్టీసీ చైర్మన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లు కట్టుకోవడంతోపాటు అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్‌ మాట్లాడారు. నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో మున్సిపల్‌ కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు.

హైదరాబాద్‌లో మాదిరిగా రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రిని కోరుతానని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా మంది ఉద్యోగులకు వేతనాలు పెరిగాయని, మున్సిపల్‌ కార్మికుల వేతనాలు కూడా పెంచాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. కనీస వేతనాల పెంపుదల కోసం మంత్రిత్వ స్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నాయన్నారు. కార్మికుల సంక్షేమం కోసం త్వరలో రామగుండంలో వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి ప్రారంభమవుతుందని తెలిపారు.

స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, 24 గంటల మంచినీటి సరఫరా తదితర కార్యక్రమాలను 15 ఏళ్ల క్రితమే తాను రామగుండం మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న కాలంలో ప్రవేశపెట్టి విజయవంతం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం వెనుక మున్సిపల్‌ కార్మికుల విశేష కృషి ఉందన్నారు. రామగుండం ప్రాంతాన్ని రీకన్‌స్ట్రక్షన్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఆర్‌ఏవై స్కీం ద్వారా మురికివాడలను తొలగించి అందమైన భవనలుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తే, కొందరు నాయకులు ప్రజలను తప్పుదోవపట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల వ్యతిరేకతతో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదన్నారు. రీకన్‌స్ట్రక్షన్‌ చేయనిదే ముఖ్యమంత్రి మరో రూ.400 కోట్లు మంజూరు చేసినా రామగుండం అభివృద్ధికి నోచుకోదని స్పష్టం చేశారు.

తొలిసారి పండగలా...
మేడే పర్వదినాన్ని తొలిసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పండుగలాగా నిర్వహించడం సంతోషంగా ఉందని నగర మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ అన్నారు. మున్సిపల్‌ కార్మికులకు గతంలో రెండుమూడు నెలలకొకసారి వేతనాలు ఇచ్చేవారని, తమ పాలకవర్గం వచ్చిన తర్వాత ప్రతీనెల జీతాలు చెల్లిస్తున్నామన్నారు.

గతంలో కార్మికులు సమ్మె చేస్తే  తాము రూ.వెయ్యి పెంచి ఇవ్వడానికి ముందుకు వచ్చామన్నారు. పరిశుభ్రతలో రాష్ట్రంలో నంబర్‌ వన్‌గా ఎదిగిన స్థానిక కార్మికులకు కూడా రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావాలనేది తన ఆకాంక్ష అన్నారు. పాలకవర్గం ఏర్పడిన తర్వాత రామగుండంను స్వచ్ఛ రామగుండంగా మార్చడానికి ట్రై సైకిళ్లు, కొత్త వాహనాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇంటింటా చెత్తను తడి, పొడిగా విభజించడంలో అవగాహన కల్పించడం కోసం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఉత్తమ కార్మికులకు ప్రశంసాపత్రాలు...
ఉత్తమ సేవలందించిన కార్మికులు, ఉద్యోగులకు ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, నగర మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా శాలువాలు కప్పి ప్రశంసపత్రంతోపాటు బహుమతులు అందజేశారు. అనంతరం మున్సిపల్‌ వర్కర్లతో కలిసి భోజనం చేశారు. తెలగాణ సాంస్కృతిక సారథి బృందం ఆలపించిన మేడే గీతాలు అలరించాయి.

కార్యక్రమంలో డెప్యూటీ మేయర్‌ సాగంటి శంకర్, కమిషనర్‌ జాన్‌శ్యాంసన్, ఫ్లోర్‌ లీడర్లు నారాయణదాసు మారుతి, మహంకాళి స్వామి, డెప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ ముప్పిడి సత్యప్రసాద్, కార్పొరేటర్లు దాసరి ఉమాదేవి, కోదాటి తిరుపతి, షేక్‌ బాబుమియా, వడ్లూరి రవి, దొంతుల లింగం, మేరుగు నరేశ్, జనగామ నర్సయ్య, కత్తెరమల్ల సుజాత, పీచర శ్రీనివాసరావు, బాలసాని స్వప్న, కో–ఆప్షన్‌ సభ్యులు జంగపల్లి సరోజన, తస్నీమ్‌ భాను, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు యాకయ్య, మురళీధర్‌రావు, నాయకులు సోమారపు అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement