తెలంగాణలో మావోయిస్టులు అడుగుపెట్టలేరు
తెలంగాణలో మావోయిస్టులు అడుగుపెట్టలేరు
Published Sat, Jun 24 2017 4:43 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM
భూపాలపల్లి జిల్లాలో త్వరలో రెండు సీఆర్‌పీఎఫ్ కంపెనీలు
మేడారంలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు- డీజీపీ అనురాగ్‌శర్మ
భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు అడుగుపెట్టలేరని, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు, జిల్లా పోలీసు కార్యాలయాలను శుక్రవారం పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ మొబైల్ కంట్రోల్ రూంను ప్రారంభించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో సమావేశమైన అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తూ, మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్నారని అన్నారు. భద్రతాపరంగా తాము రాజీ పడేది లేదన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో త్వరలోనే రెండు సీఆర్‌పీఎఫ్ కంపెనీలను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే మేడారంలో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తానని అన్నారు. మేడారం జాతరను దిగ్విజయంగా జరిపేందుకు జిల్లా పోలీసులు పకడ్భందీ ప్రణాళికలు రూపొందించాలని డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి బహుమతులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్, ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్‌హెగ్డే, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు శ్రీనివాస్, కెఆర్‌కె ప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement