సాక్షి, హైదరాబాద్: కీలక నేతల మరణాలు, లొంగుబాట్ల నేపథ్యంలో ఉనికి కోసం మావోయిస్టు పార్టీ వ్యూహం మారుస్తోందా? కేడర్‌ను కాపాడుకు నేందుకు ఈశాన్య రాష్ట్రాలకు ‘మార్చ్’ చేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొన్నాళ్ల పాటు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాలను వదిలేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమబెంగాల్ ద్వారా నాగాలాండ్ చేరువ వ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.
కార్యకలాపాల నిర్వహణకు ఏమాత్రం అను కూలంగా లేని వాతావరణం కావడంతో ఉన్న నేత లను, కేడర్‌ను కాపాడుకునే పనిలో మావోయిస్టు పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఏవోబీలో ఉన్న ఆరు కమిటీలను రెండు కమిటీలుగా, ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 4 కమిటీలను రెండు కమిటీలుగా మార్చేసిన మావో యిస్టు పార్టీ.. కేడర్‌ను కాపాడే పనిలో నిమగ్న మైంది.
ఆర్‌కే మరణం, హిడ్మా ఆరోగ్య పరిస్థితి, పెద్దగా కార్యకలాపాలు లేని తెలంగాణ కమిటీ.. ఇలా అన్ని కమి టీలు దీనావస్థలో ఉండటంతో కేవలం ఆత్మరక్షణ కోసమే కార్యాచరణ రూపొందిం చుకున్నట్టు తెలిసింది. బలంగా ఉన్న అబూజ్‌మడ్ (ఛత్తీస్‌గఢ్)ను సైతం వదిలి వెళ్లక తప్పదనే కేంద్ర కమిటీ సూచనతో ఆత్మరక్షణ చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.
ఎందుకీ పరిస్థితి..
ఛత్తీస్‌గఢ్, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీలపై బలగాలు రెండేళ్లుగా ప్రత్యేక దృష్టి సారించాయి. కేంద్ర హోంశాఖతోపాటు ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు సంయుక్తంగా ప్రతీ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టాయి. ఆయా ప్రాంతాల్లో బేస్ క్యాంపులను పెంచుకొని ప్రత్యేక శాటిలైట్ ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. దీంతో మావోయిస్టు పార్టీకి చేరాల్సిన ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, మందులు, డబ్బులు, ఆయుధాలు.. ఇలా ప్రతీ వ్యవహారంసైనా కదలికలను బేస్ క్యాంపుల ద్వారా పసిగట్టి నియంత్రించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండానే ఇన్‌ఫార్మర్లు/కొరియర్లుగా వ్యవహరిస్తున్న వారిని నియంత్రించి సక్సెస్ అయ్యారు. మావో అగ్రనేత ఆర్కే మరణం కూడా ఇందులోభాగమే అని ఆ పార్టీ బహిరంగంగానే ఆరోపించింది. మందులు, ఇతర నిత్యావసరాలను అడ్డుకొని ఆరోగ్యం క్షీణించేలా చేశారని ఆర్కే భార్య కూడా ఆరోపించింది.
వారసంతలపైనా నిఘా
అబూజ్‌మడ్‌తోపాటు ఏవోబీలోని వారసంతలపైనా బలగాలు నిఘా పటిష్టం చేశాయి. ప్రతీ కుటుంబం ప్రతీ వారం కొనుగోలు చేసే వస్తువులపై నిఘా పెట్టింది. మునుపటి వారం కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే ఇంట్లో ఏదైనా శుభకార్యముందా? లేక మావోయిస్టు పార్టీకి అందించేందుకు కొనుగోలు చేశారా అన్నంత లోతుగా ఇన్‌ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నాయి. సర్జరీ ఆధారిత మందులు, పెయిన్ కిల్లర్లు, కరోనా మెడిసిన్స్.. ఇలా ఆయా ఏరియాల్లోని మందుల షాపుల్లో కొనుగోలు చేసే వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్ సైతం చేసింది.
కొనుగోలుదారుల కదలికలను పసిగట్టి కొరియర్లను తమవైపు తిప్పుకోవడంలో కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర బలగాలు సక్సెస్ అయినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంచేశాయి. దీనివల్లే అనారోగ్యం బారిన పడిన సీనియర్ నేతల మరణాలు జరిగినట్టు చెప్తున్నాయి. ఇదేకాకుండా రెండేళ్ల నుంచి జరిగిన రాష్ట్ర, కేంద్ర కమిటీ కీలక నేతల లొంగుబాట్లు ఆ పార్టీని మరింత అఘాతంలోకి నెట్టాయని భావిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీలు అవలంబించే విధానాలు, వ్యూహాత్మక చర్యలను పసిగట్టి నిలువరించడంలో బలగాలు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కొన్నాళ్లపాటు ఈ రెండు ప్రాంతాలను వదిలి వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడినట్టు బలంగా వినిపిస్తోంది.
ఎనిమిది నెలలుగా ఒక్క నియామకం లేదు...
ఒకవైపు కీలక నేతల మరణాలు, మరోవైపు లొంగుబాట్లతో అతలాకుతలం అవుతున్న మావోయిస్టు పార్టీని కొత్త రక్తం లేక మరింత చీకట్లోకి నెట్టింది. ఛత్తీస్‌గఢ్, ఏవోబీ, తెలంగాణ, మహారాష్ట్రలో కొత్త నియామకాలు ఏమాత్రం జరగలేదు. ఎనిమిది నెలలుగా అంటే ఈ ఏడాదిలో దాదాపుగా రిక్రూట్‌మెంట్ లేకుండా చేయడంలో పోలీసులు పైచేయి సాధించారు. నియామకాలు జరగకపోవడంపై ఒక్క ఉదాహరణ మావోయిస్టు పార్టీ నుంచే వినిపిస్తోంది. ఆర్కే తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఒక ప్లాటూన్ కేవలం ఆయన రక్షణ కోసమే పనిచేసింది.
మంచానికే పరిమితమైన ఆర్కేను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆయన చుట్టూ ఉన్న ప్లాటూన్ రక్షణ దళానికి కాపలాగా లోకల్ గెరిల్లా టీమ్ రక్షణ కవచంగా నిలిచింది. ఇలా మూడు నెలల పాటు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఏవోబీ జోనల్ కమిటీ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆర్కే కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. కేవలం తన కోసం రెండు వ్యవస్థలు కార్యకలాపాలు చేయకుండా ఉండిపోవడం పార్టీకి నష్టాన్ని కల్గిస్తుందని, కొంతమంది మినహా మిగతా బృందాలు కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలని సూచించారని తెలిసింది. నియామకాలను విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని పదేపదే చెప్పినట్టు సమాచారం.
కొద్దిరోజులు దూరంగా..!
ప్రస్తుత కీలక పరిణామాలతో ఈ రెండు ప్రాంతాల నుంచి కొద్దిరోజులపాటు దూరంగా ఉండటం మంచిదని, అందుకు ఈశాన్య రాష్ట్రాలకు వలస వెళ్లకతప్పదని కేంద్ర కమిటీ భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఛత్తీస్‌గఢ్, ఏవోబీలో ఉన్న కీలక నేతలు, ముఖ్య కేడర్‌ను పశ్చిమబెంగాల్ మీదుగా నాగాలాండ్‌కు చేరుకోవాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చినట్టు పార్టీలోనూ చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ఉనికికే ప్రమాదం అన్న పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలకు బ్రేక్ ఇచ్చి నాగాలాండ్ రావాల్సినట్టుగా ఆదేశాలున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కార్యకలాపాల విస్తృతికి అక్కడి నుంచే పనిచేయాలన్న ఆలోచనలో కేంద్ర కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment