ప్రాజెక్టుల పనులు పావువంతే
కేబినెట్‌కు సమర్పించిన నివేదికలో నీటి పారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగు నీటిపారుదల శాఖకు ఇక ముందంతా అగ్ని పరీక్షే! సుమారు రూ.2లక్షల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు పావువంతే పూర్తయ్యాయి. ముందున్న భారీ లక్ష్యాలు శాఖకు అసలు సిసలు పరీక్షగా నిలవనున్నాయి. ఇప్పటికే ఖర్చు చేసిన నిధులుగాక మరో రూ.1.34 లక్షల కోట్లు వెచ్చిస్తేనే పెండింగ్, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. అప్పుడే వీటి కింద నిర్ణయించిన 68 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కానుం ది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిధుల ఖర్చు, ప్రణాళికలు, ఆయకట్టు లక్ష్యాలపై నీటిపారుదల శాఖ 12 పేజీల నోట్ సమర్పించింది. ఇందులో రాష్ట్రం లోని భారీ, మధ్య తరహా, చిన్ననీటి వనరుల కింద చేపట్టిన పనులు, ఖర్చు తదితర వివరాలను వెల్లడించింది.
సాగు లక్ష్యం.. 57 లక్షల ఎకరాలు
నోట్‌లో వెల్లడించిన సమాచారం ప్రకారం... రాష్ట్రంలో మొత్తంగా 36 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులను రూ.1,90,293 కోట్ల అంచనాతో చేపట్టారు. ఇందులో రూ.97,431.61 కోట్ల పనులకు కాంట్రాక్టు ఏజెన్సీలతో ఒప్పందా లు కుదిరాయి. వీటిలో ఇప్పటివరకు రూ.55,858.36 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.1,34,434 కోట్ల నిధులు వెచ్చించి మిగతా పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఏడాదికి రూ.25 వేల కోట్లు వెచ్చిస్తూ అనుకు న్నట్టు చేస్తే ఈ పనుల పూర్తయ్యేందుకు ఐదేళ్లు పడుతుంది. మొత్తం ప్రాజెక్టుల కింద 68,19,496 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు మరో 8,44,573 ఎకరాలు స్థిరీకరణ చేయా ల్సి ఉంది. ఇందులో 11.36 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 1.41 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.
70 శాతానికిపైగా పనులు పూర్తయిన ప్రాజెక్టు ల్లో కొమురంభీం, పెద్దవాగు, గొల్లవాగు, రాలివాగు,మత్తడివాగు, ఎల్లంపల్లి, ఇందిర మ్మ వరద కాల్వ, పాలెంవాగు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, భీమా, దేవాదుల వంటి ప్రాజెక్టులున్నాయి. వీటిని అనుకున్నట్లు పూర్తి చేస్తే వచ్చే ఏడాదికల్లా పూర్తి ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యమవుతుంది. ఈ దృష్ట్యా వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ ఏడాది చివరికి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి వీలైనంత ఎక్కువ నీటిని పంపిణీ చేసేలా పనులు జరగాల్సి ఉంది. కాగా, చాలా ప్రాజె క్టులకు భూసేకరణ సవాలుగా మారింది.