వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో జిల్లాకు నేతలకు కీలక పదవులు దక్కాయి. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం జాబితాను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పార్టీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎడ్మకిష్టారెడ్డి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భీష్వ రవీందర్ రాష్ట్ర యువజనవిభాగం అధ్యక్షుడిగా, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుల య్యారు.
కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జి.రాంభూపాల్‌రెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా, మిడ్జిల్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు టి.భీమయ్య గౌడ్ (జడ్చర్ల), బంగి లక్ష్మణ్ (కొల్లాపూర్)లను రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ ఎనిమిదో తేదీ నుంచి 12వ తేదీవరకు ైవె ఎస్ షర్మిల జిల్లాలో ఐదు రోజుల పాటు పరామర్శ యాత్ర చేపట్టారు.
యాత్ర సందర్భంగా చురుకుగా వ్యవహరించిన ఎడ్మ కిష్టారెడ్డితో పాటు భీష్వ రవీందర్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి తదితర నేతలకు కీలక పదవులు దక్కాయి. జిల్లాకు చెందిన మిగతా ముఖ్య నేతలకు అనుబంధ విభాగాలు, జిల్లా కమిటీలో చోటు దక్కే అవకాశం ఉంది. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి వరుసగా రెండు పర్యాయాలు జిల్లా కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.
రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటం
- రైతు విభాగం రాష్ర్ట అధ్యక్షుడు ఎడ్మకిష్టారెడ్డి
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటి పరిష్కారం కోసం పోరాడుతాం. తెలంగాణలో రైతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. కరువు, కరెంటు కోత, అప్పులు దొరకకపోవడంతో పాటు గిట్టుబాటు ధర రాక అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. గతంలో రైతుల సమస్యలపై ఆమరణ దీక్ష, ధర్నాలు చేశాను. రైతులకు ధైర్యం కల్పిస్తా. నాకు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టి రైతుల సమస్యలపై పోరాడే అవకాశం కల్పించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పి. శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు.
పార్టీని బలోపేతం చేస్తాం
భీష్వ రవీందర్,రాష్ట్రఅధ్యక్షుడు,యువజన విభాగం
అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించి యువజన విభాగం కార్యవర్గం ఏర్పాటు చేస్తా. పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటాం. విద్యార్థి, యువజనులకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతాం. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, తెలంగాణ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దిశా నిర్దేశంలో అన్నివర్గాలకు పార్టీ చేరువయ్యేలా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో పార్టీ విస్తరణ, బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా.
పార్టీ పటిష్టతకు కృషిచేస్తా
- జి.రాంభూపాల్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింనందుకు జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిలమ్మ, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానీయను. దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాలను, ఆయన హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తా. జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు అంకుటిత దీక్షతో పనిచేస్తా. పార్టీ అధినాయకత్వం నిర్ణయానుసారం పార్టీని ముందుకు నడిపిస్తాం.
నమ్మకాన్ని నిలబెడతా
- మామిడి శ్యాంసుందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నాపై నమ్మకాన్ని ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జిల్లాపై చెరగని ముద్ర వేశాయి. వైఎస్ పథకాల మూలంగా లబ్ధి పొందిన వారు నేటికీ ఆయన పాలనను తలచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందిస్తాం.
పాలమూరుకు పెద్దపీట
Published Sat, Jan 10 2015 2:52 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement