సాక్షి, హైదరాబాద్: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ రెండోరోజు సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. రవిప్రకాశ్‌ను మంగళవారం ఐదు గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఇక సైబర్ క్రైం కార్యాలయం వద్ద రవిప్రకాశ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అనంతరం స్టేషన్‌లోకి వెళ్లారు. ఆయనకు పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు.
(సత్యాన్ని చంపేయబోతున్నారు : రవిప్రకాశ్)
- కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు..? ఎందుకు చేయాల్సి వచ్చింది.
- తాజాగా కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలతో ఎన్‌సీఎల్టీకి పాత తేదీలతో శివాజీతో మీరు ఫిర్యాదు చేయించడానికి కారణాలేంటి..?
- శివాజీకి 40 వేల షేర్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది. మీ స్నేహితుడైన శివాజీకి షేర్లు బదిలీ చేయకుండా ఎందుకు చీట్ చేశారు ?
- మీడియా, మాఫియా మధ్య పోరాటం అంటున్నారు కదా..! టీవీ9 యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు సీఈఓగా దానిని కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సిన బాధ్యత మీకు లేదా..?
- టీవీ9 లోగో అనేది ఆ సంస్థకు చెందిన ఆస్థి.. టీవీని అమ్మాం కానీ లోగోను అమ్మలేదంటూ మీరు మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా..?
- యాజమాన్యానికి తెలియకుండా టీవీ 9 నిధులను మీరు దుర్వినియోగం చేశారా ..? లేదా..?
- ఒకవేళ మీరు ఎలాంటి తప్పులు చేయనప్పుడు నెలరోజులుగా ఎందుకు తప్పించుకు తిరిగారు...పోలీసులకు ఎప్పుడో లొంగిపోయి వివరణ ఇస్తే అయిపోయేది కదా.. అని పోలీసులు రవిప్రకాశ్‌కు పలు ప్రశ్నలు సందించారు.
Comments
Please login to add a commentAdd a comment