
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు ఒకప్పుడు ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్ ద్వారా ఎరవేసి నిండా ముంచే వారు. ఇప్పుడు వారిపంథా మారింది. సోషల్‌మీడియా విస్తరణ నేపథ్యంలో ప్రతి వంద మంది యువకుల్లో కనీసం 60మందికి ఫేస్‌బుక్ అకౌంట్లు ఉంటున్నాయి. దీన్నే సైబర్ కేడీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సాధారణంగా ఈ–మెయిల్, ఎస్సెమ్మెస్ పంపితే తమ వివరాలు ఎదుటి వారికి ఎలా తెలిశాయా? అనే సందేశంలో కొందరు సంప్రదించరు. అదే ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకున్నానంటూ ఓ సందేశం వస్తే ఎలాంటి అనుమానం రాకుండా సంప్రదిస్తారు అనే అంశాన్ని సైబర్ నేగరాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. విదేశీయులుగా చెప్పుకొంటున్న వీళ్లు మహిళలకు ఎర వేయడానికి పురుషుల పేర్లతో, పురుషులకు మహిళల మాదిరిగా ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. వారి నుంచి ఫేస్‌బుక్‌లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, మెసెంజర్‌లోని సందేశాలకు స్పందించి రిప్లై ఇస్తే చాలు హత్తుకుపోయేలా ‘ప్రవర్తిస్తారు’. కొన్నాళ్ళ పాటు నిజాయితీతో కూడిన చాటింగ్ జరుగుతుంది. ఇలా తమపై పూర్తి నమ్మకం వచ్చిన తర్వాత అసలు కథ మొదలెడతారు.
హనీ, డియరెస్ట్ అంటూ సంబోధించడం ప్రారంభిస్తున్న సైబర్ కేడీలు ఆధ్యంతం ఆకర్షించే, ఆకట్టుకునే విధంగా మెసెంజర్‌లో సందేశాలు రాస్తున్నారు. ఒక్కోసారి ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సాప్ ద్వారానూ సంప్రదింపులు జరుపుతున్నారు. తమకు చెందిన, తమ వాళ్లకు భారీ మొత్తం విదేశీ బ్యాంకుల్లో ఉందని చెప్తూ మరింత నమ్మకం కలిగేందుకు బ్యాంకుల పేరుతో కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి పంపుతారు. ఆ డబ్బు సొంతం చేసుకోవడానికి ఫలానా వ్యక్తిని సంప్రదించాలంటూ ఓ ఫోన్ నెంబర్ ఇస్తారు. అలా చేస్తే... అవతలి వ్యక్తి డబ్బును పంపడానికి కొన్ని రికార్డులు సృష్టించాల్సి ఉందంటూ అందుకు ఖర్చులు ఉంటాయని చెప్పి వీలున్నంత వరకు డిపాజిట్ చేయించుకుని మోసం చేస్తారు. కొన్నిసార్లు ఈ ఫేస్‌బుక్ కిలాడీలు పెళ్ళి చేసుకుంటానని, కలిసి వ్యాపారం చేద్దామని, భారీ మొత్తం పార్శిల్ చేస్తున్నానని, ఖరీదైన గిఫ్ట్ పంపిస్తున్నానని ఎర వేస్తారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజులకు కస్టమ్స్ అధికారుల పేరుతో, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల నుంచి అంటూ బాధితులకు ఫోన్ వస్తుంది. ఫలానా వారు వచ్చారని లేదా భారీ మొత్తం, గిఫ్ట్ పంపారని/వెంట తీసుకువచ్చారని చెప్తారు. కస్టమ్స్ నిబంధనల ప్రకారం అంత విదేశీ కరెన్సీ లేదా అంత ఖరీదైన గిఫ్ట్ పంపడం/తీసకురావడం నేరం కావడంతో అదుపులోకి తీసుకున్నామంటారు. వ్యక్తిని విడుదల చేయడానికి, వాటిని పంపడానికి డబ్బు కట్టాలంటూ అందినకాడికి దండుకుంటారు. గత వారం నగరంలో ఉంటున్న ఓ కల్నల్ భార్యకు ఫేస్‌బుక్ ద్వారా లండన్ వాసిగా పరిచయమైన వ్యక్తి కలవడానికి వస్తున్నానని చెప్పాడు. రెండు రోజులకు అతడు వచ్చినట్లు, ఢిల్లీ కిడ్నాప్ అయినట్లు ఫోన్లు వచ్చాయి.ఈ మాటలు నమ్మిన ఆమె రూ.1.5 లక్షలు చెల్లించేసింది. ఆపై మరో రూ.10 లక్షలు డిమాండ్ చేయడంతో మోసమని గ్రహించి భర్తకు చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్రమత్తతోనే అడ్డుకట్ట...
నైజీరియన్ ఫ్రాడ్స్ చేసే సైబర్ నేరగాళ్లు అనేక రకాలుగా గాలం వేస్తుంటారు. వాటిలో భాగంగానే ఇలాంటి ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్, ఫేస్‌బుక్ మెసేజ్‌లు పంపిస్తుంటారు. ఫేస్‌బుక్‌లో ఉన్న ప్రొఫైల్స్ అన్నీ నిజమని నమ్మకండి. వీటికి ఆకర్షితులై వారు చెప్పినట్లు నగదు డిపాజిట్ చేస్తే బాధితులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ తరహా వాటిని స్పందించకపోవడం ఉత్తమం. ఇన్‌బాక్స్‌లో కనిపించిన వెంటనే డిలీట్ చెయ్యాలి. సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పడానికి సైబర్ క్రైమ్ పోలీసులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తేనే వారికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా సైబర్‌క్రైమ్ పోలీసుల్ని సంప్రదించండి.– కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment