‘ఆపరేషన్‌’ రెయిన్‌! | Dana Kishore Review on Rain in Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్‌’ రెయిన్‌!

Published Mon, Jun 24 2019 9:02 AM | Last Updated on Mon, Jun 24 2019 9:02 AM

Dana Kishore Review on Rain in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఈ సీజన్‌లో కురిసిన తొలి వర్షానికే ఐటీ కారిడార్‌లో పరిస్థితి అతలాకుతలంగా మారడంతో..ఇక ముందు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు తగిన కార్యాచరణ రూపొందించారు. ఒక్క వర్షానికే హైటెక్‌సిటీ జీవనం కకావికలం కావడంతో,  అందుకు కారణాలు, పరిష్కార మార్గాలపై సమీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్, శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ హరిచందన దాసరి, చీఫ్‌ ఇంజినీర్‌ జియాఉద్దీన్, జేఎన్‌టీయూ నిపుణులు శని, ఆదివారాల్లో నీటిముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆదివారం సైబరాబాద్‌ పోలీస్‌ కార్యాలయంలో వీరితో పాటు విద్యుత్‌ అధికారులు, తదితరులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలు, క్షేత్రస్థాయి తనిఖీల పరిస్థితులతో వర్ష సమస్యల పరిష్కారానికి తగు నిర్ణయాలు తీసుకున్నారు. 

నగరంలో మొత్తం 197 ప్రాంతాల్ని నీటి ముంపు సమస్య ప్రాంతాలుగా గుర్తించారు. వీటిల్లో 37 ప్రాంతాలకు ఇప్పటికే  శాశ్వత పరిష్కారం చేయగా, ఇవి పోను మిగతా 160 ప్రాంతాలను సమస్య తీవ్రతను బట్టి ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించారు. వీటిల్లో  ఏ కేటగిరీలో సీజన్‌ ముగిసేంత వరకు నీటిని తోడే భారీ మోటార్‌ పంపులను,  సిబ్బందిని శాశ్వతంగా 24 గంటల పాటు అందుబాటులో ఉంచుతారు. వర్షం పడగానే వారు రంగంలోకి దిగుతారు. మిగతా ప్రాంతాల్లో దగ్గర్లోని  ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, షాపులు, వంటి ప్రాంతాల్లో 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన మోటార్‌ పంపులను ఉంచుతారు. వర్షం పడుతుందనే వాతావరణశాఖ సూచనలతో లేదా వర్షం పడ్డ వెంటనే తోడేందుకు మనుషులు అక్కడకు వెళ్తారు. ఇరవైనాలుగు గంటల్లో ఎప్పుడైనా వెంటనే సన్నద్ధంగా ఉంటారు.     

ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌..
శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లోని 12 లొకేషన్లలో సమస్య పరిష్కారానికి  ప్రత్యేకంగా యాక్షన్‌ప్లాన్‌ రూపొందించారు. అక్కడి పరిస్థితుల్ని బట్టి దేనికదిగా వేర్వేరుగా ఈ యాక్షన్‌ప్లాన్‌ రూపొందించారు. జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌రావు సూచనల మేరకు ఆయా ప్రాంతాల్లో  ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడే వరదనీరు  సమీపంలోని ఒక ప్రాంతానికి చేరి నిల్వ ఉండేలా పర్‌కొలేషన్‌ట్యాంక్స్‌ (నీటి కుంటలు) 30 ్ఠ   20 అడుగులతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  దుర్గం చెరువు, నెక్టర్‌గార్డెన్, శిల్పారామం తదితర ప్రాంతాల్లోని ఖాలీస్థలాల్లో ఈ నీటికుంటలు ఏర్పాటు చేసి వరదనీరు వాటిల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు. శిల్పారామం వంటి ప్రాంతాల నుంచి తూము పొంగుతున్నా పక్కనే ఉన్న చెరువులోకి నీరు వెళ్లేందుకు దారి లేదు. ఇలాంటి సమస్యలనూ పరిష్కరించాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాల్లో 1. 2 డయామీటర్‌ పైపుల్ని వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌( హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ప్రాంతాల్లో అది సంబంధిత పనుల్ని చేస్తుంది. మైండ్‌స్పేస్‌ వద్ద సమస్య సరిష్కారానికి టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో నీరు రోడ్డుకు ఇటు నుంచి అటు వెళ్లేందుకు పైప్‌లైన్‌ను మూడు రోజుల్లో వేయనున్నారు. సీఓడీ, సాఫ్టెల్‌  సిగ్నల్‌ జంక్షన్ల వద్ద అభివృద్ధి పనులకు జోనల్‌ కమిషనర్‌ వెంటనే టెండర్లు పిలవనున్నారు. పలు ప్రాంతాల్లో వరదకాలువల్లో ఉన్న విద్యుత్‌ లైన్లు, ఫైబర్‌ కేబుళ్లు తదితరమైన వాటితో సమస్య పెరుగుతుండటంతో . వీటిని వెంటనే తొలగించనున్నారు. పలు ప్రాంతాల్లో వరదకాలువల్లో ఉన్న విద్యుత్‌ లైన్లు, ఫైబర్‌ కేబుళ్లు తదితరమైన వాటితో సమస్య పెరుగుతుండటంతో . వీటిని వెంటనే తొలగించనున్నారు. ఫుట్‌పాత్‌ల దగ్గర  నీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా అవకాశమున్న అన్ని ప్రాంతాల్లో వెంట్‌లను పెద్దగా ఏర్పాటు చేస్తారు. జీహెచ్‌ఎంసీ వర్షాకాల విపత్తు బృందాలు, డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ తదితరమైనవి  కలిపి దాదాపు 500 వర్షాకాల  బృందాలు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం 8 డీఆర్‌ఎప్‌ టీమ్‌లుండగా, మరో 8  ఏర్పాటు చేయనున్నారు.  ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) పనులు జరుగుతున్న ప్రాంతాల్లో నిర్మాణ సామాగ్రి, ఇసుక, తదితరమైన వాటివల్ల నీరు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని దానకిశోర్‌ ఆదేశించారు. పనులు జరిగే ప్రాంతాల్లో తప్పనిసరిగా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో వర్షాల వల్ల ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ల వెంబడి, నాలాల్లో నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు (సీఅండ్‌డీ వేస్ట్‌), ప్లాస్టిక్స్, చెత్త వేసేవారికి భారీ జరిమానాలు విధించాల్సిందిగా సూచించారు. వర్షం కురుస్తున్నప్పుడు ప్రజలు బయటకు రావద్దని కమిషనర్‌ సూచించారు. అప్పటికే రోడ్ల మీద వున్నవారు సాఫీగా ఇంటికి చేరుకునేందుకు అవకాశమివ్వాలన్నారు. అందరూ రోడ్లపైకి వస్తే ట్రాఫిక సమస్యలు ఎదురవుతాయన్నారు. ఐటీ కారిడార్‌లోని 5 లక్షలమంది ఒకేసారి బయటకు వస్తే ఇబ్బందులుంటాయని, విడతల వారీగా  అయితే ట్రాఫిక్‌ చిక్కులుండవని పేర్కొన్నారు. వర్షం వచ్చాక గంట సేపటి వరకు బయటకు రాకపోవడం శ్రేయస్కరమని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement