నృత్యం విశ్వవ్యాప్త భాష
అంతర్జాతీయ నృత్యోత్సవాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
హైదరాబాద్: ‘‘నృత్యమనేది విశ్వవ్యాప్త భాష, ఇది మానసికోల్లాసాన్ని ప్రసాదిస్తుంది. మనస్సు, శరీరాల సమ్మేళనమే నాట్యం. సంస్కృతికి ప్రతీక అయిన నాట్యా న్ని, విభిన్న నాట్య రీతుల వారసత్వాన్ని పరిరక్షించు కొంటూ ముందుకు సాగవలసిన అవసరం ఉందని’’ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆదివారం హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళావేదిక ప్రాంగణంలో ప్రథమ ఏషియన్ బ్రాడ్ కాస్టింగ్ యూనియన్ (ఏబీయూ) ఇంటర్ నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్‌ను ఆయన జ్యోతి వెలిగించి అట్టహా సంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు కోవడం మన కర్తవ్యం అన్నారు.
ఉత్సవ నిర్వహణకు చక్కటి ఏర్పాట్లను చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అభినం దనలు తెలిపారు. సర్వేజనా సుఖినోభవంతు.. అందరూ బాగుండాలంటూ నూతన సంవత్సర, మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూ లాల్, ప్రసార భారతి చైర్మన్ డాక్టర్ ఎ.సూర్య ప్రకాశ్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) ఎస్.సి.పాండా, ఏబీయూ సెక్రటరీ జనరల్ జవాద్ మొతాగి, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ సుప్రియ సాహు, రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ డ్యాన్స్ ఫెస్టివల్‌లో సుమారు పది దేశాలకు చెందిన 47 మంది కళాకారులు పాల్గొన్నారు.