కంగుతిన్న కాంగ్రెస్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : డీసీసీబీ చైర్మన్ ఎన్నిక జరిగిన తీరును చూసి కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. జిల్లా సీనియర్ నాయకులంతా కలిసి చైర్మన్ అభ్యర్థిగా తెరపైకి తెచ్చిన ముత్తవరపు పాండురంగారావు అతికష్టం మీద గట్టెక్కారు. ఈ పరిస్థితి తాము ఊహించింది కాదని కాంగ్రెస్ నాయకులే కొందరు వ్యాఖ్యానించారు. మొత్తం 21 మంది డెరైక్టర్లలో కాంగ్రెస్‌కు ఏకంగా 19 మంది డెరైక్టర్లు చేతిలో ఉన్నారు. వాస్తవానికి ఏకగ్రీవంగా జరగాల్సిన చైర్మన్ ఎన్నిక ఓటింగ్ దాకా వెళ్లింది. గడిచిన రెండు రోజులుగా హైదరాబాద్‌లో క్యాంపులు నిర్వహించిన ఆశావహులు బుధవారం ఉదయం నామినేషన్ల సమయానికి డీసీసీబీకి చేరుకున్నారు. ముందు ఊహించిన దానికి భిన్నంగా చౌటుప్పల్‌కు చెందిన డెరైక్టర్ శ్రీనివాస్ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పాండురంగారావును ఏకగ్రీవం చేయాలనుకున్న కాంగ్రెస్ సీనియర్లు ఒక్కసారి ఆందోళన చెందారు. నామినేషన్ వేసే సమయానికి శ్రీనివాస్ వెంట కేవలం ఐదుగురు సభ్యులే ఉన్నారు. కానీ, తీరా ఓటింగ్ జరిగి ఓట్లు లెక్కించాక ఆయనకు ఏకంగా తొమ్మిది ఓట్లుపోల య్యాయి. మరోరెండు ఓట్లు వచ్చి ఉంటే శ్రీనివాస్ గెలిచే వారు. కాగా, పాండురంగారావుకు 12 ఓట్లు రావడంతో 3 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించారు.
తెరవెనుక ఏం జరిగింది..?
డీసీసీబీ చైర్మన్‌గా గెలవడానికి అవసరమైన డెరైక్టర్ల సంఖ్య 11. వాస్తవానికి కాంగ్రెస్ చేతిలో 19 మంది డెరైక్టర్లు ఉన్నారు. ముందు నుంచీ పాండురంగారావు అభ్యర్థిత్వాన్ని వ్యతి రేకిస్తున్న వారు, ఆయకట్టు, నాన్‌ఆయకట్టు ఫీలింగ్ తెచ్చారు. ఈసారి తమ ప్రాంతానికి పదవి ఇవ్వాలని భువనగిరి డివిజన్‌కు చెందిన డెరైక్టర్లు డిమాండ్ చేశారు. అంతే కాకుండా బీసీ, ఎస్సీ, ఫీలింగ్‌ను కూడా తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో క్యాంపులు కూడా నిర్వహించారు. కాగా, చౌటుప్పల్ డెరైక్టర్ శ్రీనివాస్ వెంట ఐదుగురు డెరైక్టర్లు కనిపించినా, ఓట్లు తొమ్మిది రావడంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు, మరో ఎమ్మెల్యే పూర్తిస్థాయి భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ కారణంగానే కేవలం ఐదుగురు సభ్యుల మద్దతే ఉన్నా, మరో ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం అయినా, అంత ధీమాగా ఉండి, నామినేషన్ దాఖలు చేయడానికి టీఆర్‌ఎస్ నాయకుల తెరవెనుక ప్రోత్సాహం కారణమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఆ ఇద్దరు నేతలు మాట్లాడి ఒప్పించడం వల్లే మరో నలుగురు డెరైక్టర్లు శ్రీనివాస్‌కు అనుకూలంగా ఓటేశారని చెబుతున్నారు. మొత్తానికి ఏకగ్రీవం అనుకున్న చైర్మన్ ఎన్నిక ఓటింగ్ దాకా వెళ్లడం, అందరి సభ్యుల మద్దతు కూడగట్టలేక పోవడం, పార్టీ నాయకత్వ వైఫల్యమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎలాగైతేనేమి గండం గడిచిందని కాంగ్రెస్ నాయకత్వం ఊపిరి పీల్చుకుంది.