
బావిలో చిరుత కళేబరం
చెన్నారావుపేట(నర్సంపేట): మండలంలోని ఎల్లాయగూడెం శివారు మాధవనగర్ కాలనీలోని వ్యావసాయ బావిలో చిరుత మృతదేహం శనివారం లభించింది. కాలనీకి చెందిన కౌలు రైతు మంచాల బక్క సదయ్య తను సాగు చేసిన మొక్కజొన్న చేనుకు శనివారం నీళ్లు కడుతుండగా వ్యవసాయ బావి నుంచి దుర్వాసన రావడంతో వెళ్లి చూశాడు. బావిలో చిరుతపులి కనిపించడంతో విషయం గ్రామస్తులకు చేరవేయగా మంచాల శ్రీను, టేకుల స్వామి, పొలిశెట్టి రాజు, సదిరం వెంకన్న, సదిరం వినయ్ అక్కడికి చేరుకుని పరిశీలించి అది పులేనని నిర్ధారించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చినా రాలేదని వారు చెప్పారు.
వారం రోజుల క్రితం చూశాం
వారం రోజుల క్రితం చిరుతపులితోపాటు రెండు పిల్లలను మామిడి చెట్టు కింద చూశాను. కాలనీ వాసులకు తెలుపడంతో వారు కూడా వచ్చి చూశారు. శనివారం మొక్కజొన్న చేనుకు నీళ్లు పెడుతుండగా బావిలో వస్తోందని రైతు సదయ్య చెబితే వెళ్లి చూశాం. బావిలో చిరుతపులి మృతదేహం నీటిలో తేలి ఉంది. మిగతా రెండు చిరుతలు ఎక్కడున్నాయో.. భయంగా ఉంది. – మాసాని ప్రసంగి, రైతు
భయం.. భయంగా గడుపుతున్నాం
చిరుత పులులు వ్యవసాయ బావి వద్ద కనిపించినప్పటి నుంచి భయం.. భయంగా గడుపుతున్నాం. వ్యవసాయ పనులకు కూలీలు రావడం లేదు. రైతులు కూడా ఉదయంపూటనే పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. – టేకుల స్వామి, కాలనీవాసి
Comments
Please login to add a commentAdd a comment