బతుకు భారమై..
వ్యక్తి బలవన్మరణం
- దుబాయికి పాస్‌పోర్ట్ సైతం తీసి..
- వెళ్లేందుకు చేతిలో డబ్బులు లేక...
- ఆత్మహత్యకు పాల్పడిన వైనం
మెదక్‌రూరల్: అటు అప్పుల బాధ.. ఇటు బతుకుదెరువు లేక ఓ వ్యక్తి తీవ్ర మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మగ్ధూంపూర్ పంచాయతీ మదిర గ్రామమైన మస్తాన్‌పూర్‌లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం..
గ్రామానికి చెందిన బైకరి సాయిలు(43)కు ఎకరంన్నర వ్యవసాయ పొలం ఉండింది. ఏడాది క్రితం ఉన్న పొలాన్ని అమ్మి కూతురు పెళ్లి చేశాడు. అయితే అత్తారింటి వేధింపులు భరించలేక కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. నాటి నుంచి సాయిలు కుంగికుషించిపోయాడు. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ లోకం విడిచిపోవడంతో ఎప్పుడూ మనోవేదనకు గురయ్యేవాడు.
కాగా ఆసరా ఇచ్చిన పొలం పోగా, స్థానికంగా బతుకుదెరువు లేక అప్పులోళ్లను ఆశ్రయించాడు. సుమారు రెండు లక్షల వరకు అప్పులు అయ్యాయి. దుబాయి వెళ్లేందుకు పాస్‌పోర్టును సైతం తీశాడు. కాని అక్కడకు వెళ్లేందుకు డబ్బులు లేక నిత్యం దిగాలు చెందేవాడు. ఇక కుటుంబ పోషణకు అప్పులు పుట్టకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఇక చేసేది లేక తెల్లవారుజామున అదివరకే తెచ్చుకున్న కూల్‌డ్రింక్‌లో విష గుళికలు కలుపుకుని తాగాడు. ఉదయం లేచి చూసిన ఇంటి ఇల్లాలికి భ ర్త విగత జీవిగా పడిఉండటంతో బోరున ఏడ్చింది. విషయం తెలిసిన రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరకుని శవాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాయిలుకు భార్య అంశవ్వ, పదోతరగతి చదువుతున్న కొడుకు ఉన్నారు.
కొడుకు పైలం..
ఏన్నడు లేని తన భర్త బుధవారం రాత్రి భోజనం చేశాక కొడుకు భవిష్యత్తు పయిలమని, వాడిని ఉన్నత చదువులు చదివించాలని తన భర్త తనతో చెప్పాడని సాయిలు భార్య అంశవ్వ బోరున విలపించింది. పాస్‌పోర్ట్ వచ్చింది కాదా... విదేశాలకు వెళ్తాడేమే అనుకున్నాను గానీ... తిరిగిరాని లోకాలకు వెళ్తాడని ఊహించలేకపోయానని ఆమె గుండెలు బాదుకున్న తీరు గ్రామస్తులకు కంటనీరు తెప్పించింది.
కుమారుడు శ్రీనివాస్ తన తండ్రి పాస్‌పోర్ట్‌ను చూపుతూ అయాయకపు చూపులతో చూడసాగాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని గ్రామసర్పంచ్ యాదమ్మ, ఎంపీటీసీ భిక్షపతి ప్రభుత్వాన్ని కోరారు.