
దుబాయ్ : కేరళకు చెందిన ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త జాయ్ అరక్కల్ (54) దుబాయ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా.. ఆయనది ఆత్మహత్యగా తేలింది. భారత్‌లోని కేరళకు చెందిన అరక్కల్ గతంలోనే దుబాయ్‌లో స్థిరపడ్డారు. ఓ చిరు ఉద్యోగిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. అనతికాలంలో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 23న ఆయన నివాసం ఉంటున్న 14 అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
మొదటి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న దుబాయ్ పోలీసులు.. వారంపాటు విచారణ జరిపి ఆత్మహత్యగా నిర్ధారించి మిస్టరీని ఛేదించారు. ఆర్థిక ఇబ్బందులతోనే బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. జాయ్ మృతదేహాన్ని యూఏఈ నుండి చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా స్వదేశానికి తీసుకొచ్చి స్వస్థలమైన కోజీకోడ్ జిల్లా మనంతవడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.