సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్‌లో విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి అధికార టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యేలు ఫిరాయించగా స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు దాఖలు చేశామని, వాటిని పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్ గతంలో సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఆర్.కె.అగ్రవాల్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం.. దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి సిఫారసు చేసింది.
ఈ సందర్భంగా ‘‘అనర్హత పిటిషన్లు ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉండడాన్ని ఎలా చూడాలి? స్వయంగా స్పీకర్ ఫిరాయింపులకు పాల్పడ్డ ఉదంతాలు చూశాం. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా కళ్లు మూసుకొని కూర్చోలేం. స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు తగిన కాలపరిమితి ఉంటే పిటిషన్లు పరిష్కారమవుతాయి’’ అంటూ వ్యాఖ్యలు చేసింది. సాధ్యమైనంత త్వరగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయ మూర్తికి నివేదిస్తూ గతేడాది నవంబర్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ కేసు మళ్లీ విచారణకు రాలేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్ తరపున న్యాయవాది జంద్యాల రవిశంకర్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో అక్టోబర్‌లో రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారిస్తుందని బెంచ్ పేర్కొంది.
ఫిరాయింపుల పిటిషన్‌పై వచ్చేనెలలో విచారణ
Published Sat, Sep 23 2017 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement
Advertisement