కుదరని ముహూర్తం
- సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవం వాయిదా
- తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లోనూ ఇదే పరిస్థితి
- ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఎదురుచూపు
- రెండున్నరేళ్లుగా తెరుచుకోని దుస్థితి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : శాస్త్ర, సాంకేతిక అంశాలపై విజ్ఞానం పెంపొందించేందుకు నిర్మించిన సైన్స్ సెంటర్ తెరుచుకోవడం లేదు. రెండున్నరేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయినా.. ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ముహూర్తం కుదరడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా.. పర్యావరణ దినోత్సవం(జూన్ 5)న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. గతంలోనూ ఇలాంటి ముహూర్తాలు నిర్ణయించినా.. చివరి నిమిషంలో వాయిదా పడ్డారు.
ఇప్పుడూ అదే జరిగింది. సైన్స్ సెంటర్ నిర్వహణ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి ఆధ్వర్యంలో ఉంటుంది. దీనికి ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఉన్న సైన్స్ సెంటర్ ఇటీవలే ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి పరిధిలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా ప్రారంభించాల్సి ఉంది. ఈ కారణంగానే శుక్రవారం నాటి ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దయిందని అధికారులు చెబుతున్నారు. కారణం ఏదైనా ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంలో ఇంకా అయోమయమే నెలకొంది.
కథ కమామిషూ..
పాఠ్యపుస్తకాల్లోని క్లిష్టమైన అంశాలను విద్యార్థులకు సులువుగా తెలియజేసే లక్ష్యంతో జిల్లా కేంద్రంలోని జూ పార్క్ ఎదురుగా సైన్స్ సెంటర్‌ను నిర్మించారు. దీని నిర్మాణం కోసం రూ.3.85 కోట్లు ఖర్చు చేశారు. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు సంబంధించిన మౌలిక అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించే ఎన్నో అంశాలు(ఎగ్జిబిట్లు) ఈ సైన్స్ సెంటర్‌లో ఉన్నాయి. మూడు అంతస్తుల భవనం గల గల సైన్స్ సెంటర్ ప్రాంగణంలో పార్కింగ్ మొదలు.. భవనంలోని ప్రతి అంతస్తులో వివిధ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన ఎగ్జిబిట్లు ఏర్పాటు చేశారు. ఏడు విశాలమైన హాళ్లు ఉన్న ప్రధాన భవనంలో.. మొదటి రెండు హాళ్లలో ఫిజికల్ సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు.
మిగతా వాటిలో వరుసగా స్పేస్ సైన్స్, సోలార్ పవర్, 5డి థియేటర్, పర్యావరణ కాలుష్యం, మానవ శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన నమూనాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ త్రూ సాటిలైట్ హాల్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సాంకేతిక సంస్థల్లో జరిగే వైజ్ఞానిక సదస్సులను ఈ హాల్‌లో ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది. అక్కడ జరుగుతున్న చర్చల్లో ఇక్కడి నుంచే పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు.
పాతికేళ్ల కల..
1986లో తిరుపతి, విజయవాడ, వరంగల్‌లో ప్రాంతీయ సైన్స్‌సెంటర్లను నిర్మించాలని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సైన్స్ సెంటర్ల నిర్మాణానికి శిలాఫలకం వేశారు. నిధులు మాత్రం కేటాయించలేదు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2008లో ఈ సెంటర్ల నిర్మాణానికి రూ.5.87 కోట్లు కేటాయించారు. 2013 మార్చి నాటికి భవన నిర్మాణంతోపాటు ఎగ్జిబిట్లను బిగించడం పూర్తయింది. ప్రారంభానికి మాత్రం ముహూర్తం కుదరడం లేదు.