పాఠ్య పుస్తకాల్లో మార్పుల ఖరారెప్పుడు?
ఒకటి నుంచి పదో తరగతి వరకున్న తెలుగు పాఠ్య పుస్తకాలు, 6, 7, 8, 9,10 తరగతుల్లో సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకాల సిలబస్‌లో తెలంగాణ తరహా మార్పులు తీసుకొస్తూ రూపొందించిన కొత్త పుస్తకాలు ఇంకా ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు పరిశీలనలోనే ఉన్నాయి. సిలబస్ మార్పుల కమిటీ రెండు నెలల పాటు కసరత్తు చేసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వివిధ అంశాలను తొలగించింది. తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలను చేర్చింది.
ఆ మార్పులతో కూడిన కొత్త పుస్తకాలను నెల రోజుల కిందటే ముఖ్యమంత్రి ఆమోదానికి పంపినా.. ఇంతవరకు మోక్షం లభించలేదు. దీంతో అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. మార్పు చేసిన పుస్తకాలను ముద్రించి జూన్ 12లోగా పాఠశాలలకు అందజేయాల్సి ఉంది. ఇంకా ఆలస్యమైతే సకాలంలో విద్యార్థులకు ఈ పుస్తకాలను అందించలేమోననే ఆందోళన మొదలైంది. సీఎం త్వరగా స్పందించి పుస్తకాల్లో మార్పులను ఖరారు చేయాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు.
ప్రధాన మార్పులివీ...
- అన్ని తరగతుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్ర పటాలున్న చోట తెలంగాణ చిత్రం పటాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర ఉన్న చోట తెలంగాణ సమగ్ర చరిత్ర ఉండనుంది. భారత దేశ పటంలో ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణను వేరుగా చేస్తారు.
- 6, 7, 8 తరగతుల్లోని సాంఘిక శాస్త్రంలో భారీగా మార్పులు రానున్నాయి. 9వ తరగతిలో రెండు పాఠాలు, టెన్త్‌లో ఒక పాఠంలో మార్పులు చేశారు.
- 6, 7, 8 తరగతుల్లో తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, పరిసర రాష్ట్రాలు, వాటితో సంబంధాలపై పాఠాలు ఉండనున్నాయి. నీటి వనరులు, నదులు, ఉపనదులు, చెరువులు, పంటలకు ప్రధాన సాగునీటి ఆధారాలు, ఒకప్పటి చెరువులు, వాటి ప్రాధాన్యం, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయకు చోటు కల్పిస్తున్నట్లు తెలిసింది.
- తెలంగాణ ఉద్యమ చ రిత్ర, ఆంధ్రప్రదేశ్ అవ తరణకు ముందు.. ఆ తర్వాతి అంశాలు, ఉద్యమంలో కేసీఆర్, టీఆర్‌ఎస్ పాత్రపై పాఠ్యాంశాలు, నిజాం పాలన, రజాకార్లు, పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ అవతరణకు చోటు, సాయుధ పోరాట యోధులు, వారి చరిత్ర, ప్రత్యేక తెలంగాణ పోరాటానికి దారి తీసిన పరిస్థితులను పాఠ్యాంశాలుగా చేర్చుతున్నారు.
- తెలంగాణ వైతాళికులైన ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, కొమురం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ తదితరుల జీవితాలు, తెలంగాణ రాష్ట్రం కోసం వారి కృషిపైనా పాఠ్యాంశాలు ఉండనున్నట్లు తెలిసింది.
రామాయణం, భారతం వంటి ఇతిహాసాలపై గతంలో ఉన్న పాఠ్యాంశాలను తొలగిస్తున్నారన్న వదంతులు రాగా... వాటిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం వాటిని అలాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.