ఇంకెన్నాళ్లు! | delayed in open admission process | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లు!

Published Wed, Sep 17 2014 2:13 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

delayed in open admission  process

 సాక్షి, మంచిర్యాల : వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారిని విద్యావంతులను చేసే సార్వత్రిక విద్య ప్రవేశ ప్రక్రియ ఆలస్యం కావడం ఆశావహులకు కలవరం కలిగిస్తోంది. ఈ విధానంలో పది, ఇంటర్ పూర్తి చేసే అవకాశం ఉంది. పదోన్నతులు పొందేందుకు వేచి ఉన్న వారు, ఉద్యోగార్హత కోసం ఉన్నత విద్య ఆలోచనలో ఉన్న వారు జాప్యంతో కలవరపాటుకు గురవుతున్నారు.

ఓపెన్ స్కూల్ విధానం ద్వారా 2008లో పది, 2010లో ఇంటర్ చదివే అవకాశం కల్పించారు. ఈ సార్వత్రిక విద్యా విధానంలో ప్రతి ఏడాది వందల మంది విద్యార్థులు ఇంటర్, టెన్త్ పూర్తి చేస్తున్నారు. గతేడాది జిల్లాలో 45 ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ల ద్వారా 3,197 మంది విద్యార్థులు ఇంటర్  విద్య అభ్యసించారు. ఇదే సమయంలో 2,835 విద్యార్థులు 48 అధ్యయన కేంద్రాల ద్వారా పదో తరగతిని పూర్తిచేసుకున్నారు. ఇంతటి డిమాండ్ ఉన్న నేపథ్యంలో అధికారుల జాప్యం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 అందుకే ఆసక్తి..
 ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు, ప్రైవేటు నౌకరీ చేస్తున్న చిరుద్యోగులు పదోన్నతి కోసం ఓపెన్ విద్యను ఆశ్రయిస్తున్నారు. స్వయం ఉపాధికి అర్హత కావాల్సిన వారు సార్వత్రిక విద్యపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తామూ విద్యావంతులం అయితే ఇంటివద్ద పిల్లలకు చదువుకోవడంలో సహాయపడవచ్చని గృహిణులు భావిస్తున్నారు. ఈ విధానంలో ఇంటర్‌ను ఒకే సంవత్సరంలో పూర్తిచేసే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ప్రతి ఆదివారంతోపాటు రెండో శనివారం విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మరో సౌలభ్యాన్ని గృహిణులకు కల్పించినట్లయింది.

 గతేడాది తరగతులను 30కి కుదిస్తూ టైంటేబుల్  ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్ర విద్యార్థులకు ఊహించని బంపర్ ఆఫర్ దొరికినట్లయింది. రాజస్థాన్ ఓపెన్‌స్కూల్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ విద్యార్థులకు జాతీయస్థాయిలోని ఉద్యోగాలకు అర్హులను చేసే విధంగా నిబంధనలు సడలించారు.

 త్వరలోనే అవకాశం..
 ఏటా జూన్ లేదా జూలై నెలలో విడుదల అవ్వాల్సిన ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల నోటిఫికేషన్ ఈ ఏడాది ఆలస్యం అవుతోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ వల్ల ప్రకటనలో జాప్యం జరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ర్టస్థాయి ఆదేశాలు వచ్చిన వెంటనే అందుకు అనుగుణంగా తాము ప్రకటన జారీచేస్తామని తెలిపారు. ఈ వారంలోగా నోటిఫికేషన్ వస్తుందని పేర్కొంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement