హైదరాబాద్: రాజధానిలో ఏటా జరిగే సదర్ ఉత్సవాల కోసం హర్యానా నుంచి తీసుకువచ్చిన దున్నపోతులు షహాన్‌షా, ధారాలు రోడ్డుపై చిన్నపాటి యుద్ధ వాతావరణాన్నే సృష్టించాయి. దున్నల మధ్య జరిగిన భీకర పోరు నగర వాసులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. దున్నలను చూసేందుకు అక్కడికి వచ్చిన మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి కొద్దిలో ప్రమాదం తప్పింది. ఈ దున్నల పొట్లాటకు ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని సత్తర్‌భాగ్ వేదికైంది. అనంతరం ఓ దున్న ముషీరాబాద్ ప్రధాన రహదారిపై రాజా డీలక్స్ వరకు పరుగులు తీయడంతో దానిని పట్టుకునేందుకు నిర్వాహకులు చెమటోడ్చాల్సి వచ్చింది. ఘటనలో మహమూద్ అలీ కాన్వాయ్‌లోని వాహనాల అద్దాలు స్వల్పంగా పగిలిపోయాయి.
శుక్రవారం (9వ తేదీ) జరిగే సదర్ ఉత్సవాల కోసం 2 భారీ దున్నపోతులు షహాన్‌షా, ధారాలను ముషీరాబాద్‌కు చెందిన అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ నగరానికి తీసుకువచ్చారు. ప్రదర్శన నిమిత్తం వీటిని గోల్కొండ చౌరస్తా సమీపంలోని సత్తార్‌బాగ్‌లో ఉంచారు. మహమూద్ అలీ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు సత్తార్‌బాగ్‌కు చేరుకుని దున్నలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ధారా, షహాన్‌షాలను ఒకే చోటకి చేర్చి ప్రేక్షకులు సెల్ఫీలు దిగుతున్నారు. అయితే ఈ రెండు కలిస్తే కొట్లాడుకుంటాయనే విషయం వారికి తెలియదు. ఒక్కసారిగా రెండు దున్నపోతులు బరిలోకి దిగినట్లు కొమ్ములతో బలంగా ఢీకొట్టుకోవడం ప్రారంభించాయి.
సమాచారం తెలుసుకున్న దున్నపోతుల నిర్వాహకులు వెంటనే అక్కడికి చేరుకుని వాటిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దున్నపోతులు సత్తార్‌బాగ్ నుంచి రాజా డీలక్స్ వరకు పరుగులు తీశాయి. వాటి అరుపులు, దున్నపోతుల గాంభీర్యం చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు వాటి నిర్వాహకులు రాజా డీలక్స్ చౌరస్తా సమీపంలో ఒక దున్నపోతును పట్టుకోగా మరో దున్నపోతును స్థానిక మసీదు వీధిలో పట్టుకున్నారు.
రోడ్డుపై దున్నపోతుల డిష్యూం..
Published Fri, Nov 9 2018 3:35 AM | Last Updated on Fri, Nov 9 2018 4:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment