క్షేత్రస్థాయిలో పర్యటనలు | developing the party potential | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయిలో పర్యటనలు

Published Wed, Jul 30 2014 2:20 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

క్షేత్రస్థాయిలో పర్యటనలు - Sakshi

క్షేత్రస్థాయిలో పర్యటనలు

పార్టీ పరిస్థితిని అంచనా వేద్దాం.. టీపీసీసీ నిర్ణయం
ఆగస్టు రెండో వారం నుంచి మండలాల్లో పొన్నాల పర్యటనలు

 
హైదరాబాద్: తమ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్షలు కొనసాగిస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)... త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే నెల రెండో వారం నుంచి జిల్లాల్లో పర్యటించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సిద్ధమయ్యారు. ఈ సమీక్షల ద్వారా గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను తెలుసుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందనే విషయాన్ని కూడా అంచనా వేయవచ్చని ఆయన భావిస్తున్నారు. మండలాల వారీగా  పార్టీ బలోపేతానికి తగిన చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న విషయం తెలిసిందే. వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలంటే గాంధీభవన్‌కే పరిమితమైతే ఉపయోగం లేదని, పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే క్షేత్రస్థాయిలో పర్యటించడమే మేలని టీపీసీసీ చీఫ్ పొన్నాల నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా ఒక్కో జిల్లాలో నాలుగైదు రోజుల చొప్పున మకాం వేసి మండలాల వారీగా సమీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.

పార్టీ బలోపేతానికి ఏయే చర్యలు చేపట్టాలనే విషయంలో కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట వేయాలన్నదే పొన్నాల అభిమతంగా కన్పిస్తోంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావొస్తున్నా... ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఏవిధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సమీక్షల ద్వారా అంచనా వేయనున్నారు. దానికి అనుగుణంగా నిరసన కార్యక్రమాలు చేపట్టే దిశగా కార్యకర్తలను సమాయత్తం చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇప్పటివరకూ మండలాల వారీగా పీసీసీ సమీక్షలు నిర్వహించిన దాఖలాల్లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో.. పార్టీ వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకే ఈ సమావేశాలకు టీపీసీసీ సిద్ధమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement