జనగామ: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయనకు ఏఐసీసీ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనే ఆవేదనతో రాజీనామా లేఖాస్త్రం సంధించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాపరెడ్డిని నియామకాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పొన్నాలకు.. పార్టీ టికెట్ కూడా రావడం లేదనే సంకేతాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా ఉంది.
మరోవైపు ఆయన రాజీనామాపై రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్న విషయాలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీసీ నేతగా అంచెలంచెలుగా ఎదిగి పార్టీ కోసం అంకితభావంతో టీపీసీసీ స్థాయికి ఎదిగిన తనకే విలువ లేకపోతే.. సాధారణ బీసీ నాయకుల పరిస్థితి ఏంటని ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపిన లేఖలో ఆవేదన వ్యక్తం చేయడంపై సానుకూలత ఉంది. అవమానం భరించలేక 45 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధ కలిగిస్తున్న దని కూడా పేర్కొనడంపైన పాజిటివ్ ఉంది.
అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం సర్వేలు, ఏఐసీసీ పరిశీలనల ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు సీనియర్లు ఎందుకు కట్టుబడి ఉండరన్న చర్చ కూడా ఉంది. ఏమీ కాలేని నేతలు కాంగ్రెస్ పార్టీ నీడలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ పదవులను అనుభవించి పార్టీ మేలు కోసం తగ్గితే తప్పేమిటన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
కాగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌పై పొన్నాల లక్ష్మయ్య రాజీనామా ప్రభావం చూపి.. మరికొందరు టికెట్ రాదని భావించే నాయకులు పార్టీని వీడకుండా టీపీసీసీ చర్యలు చేపడుతోంది. అసంతృప్తి నేతలతో సంప్రదింపులు జరిపి చక్కదిద్దే పనిలో పడింది.
టికెట్ రావడం లేదనే సంకేతం...
తెలంగాణకు తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా 119 స్థానాలకు టికెట్ల ఖరారులో కీలకంగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్యను.. తనకే టికెట్ రావడం లేదన్న సంకేతాలు ఆవేదనకు గురి చేశాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 సంవత్సరాలు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనుల కేటాయింపు మొదలు పార్టీ కార్యకలాపాల్లో ‘కింగ్‌మేకర్’గా ఉన్న ఆయనకు కొద్ది రోజులు ఏఐసీసీ పెద్దలు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.
మంత్రిగా, టీపీసీసీ చీఫ్‌గా ఉమ్మడి వరంగల్‌లో 1999 నుంచి 2014 వరకు ఓ వెలుగు వెలిగిన ఆయన గ్రాఫ్ 2016 తర్వాత పార్టీలో పడిపోయింది. ఏఐసీసీతో సైతం గ్యాప్ పెరగడంతోపాటు ఆయన నియోజకవర్గం జనగామకు కొత్త అభ్యర్థులు తెరమీదకు రావడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. తాను ఎంత వ్యతిరేకించినా.. కొమ్మూరి ప్రతాపరెడ్డిని డీసీసీ అధ్యక్షుడిని చేయడం మొదలు ఇవన్నీ తనకు టికెట్ రాకుండా చేయడమేనన్న సంకేతాలు ఆయనకున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చివరి ప్రయత్నంగా ఏఐసీసీ పెద్దలను కలిసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజీనామాకు సిద్ధమైన పొన్నాల లక్ష్మ య్య.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా లేఖను పంపడం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే పొన్నాల లక్ష్మయ్య.. త్వరలోనే బీఆర్‌ఎస్ గూటికి చేరతారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నెల 16న జనగామలో సీఎం కేసీఆర్ సభ సందర్భంగా ఈ చేరిక ఉంటుందంటున్నారు. లేదంటే అంతకంటే ముందే మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరవచ్చని అంటున్నారు.
12 ఏళ్లు మంత్రిగా..
పొన్నాల లక్ష్మయ్య నాలుగున్నర దశాబ్దాలు, నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో సుమారు 12 ఏళ్లపాటు రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. ముఖ్య మంత్రులుగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, డా.వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా 2014 మార్చి 10న పొన్నాల లక్ష్మయ్య పార్టీ కీలక పదవిని చేపట్టారు.
ఏడు పర్యాయాలు జనగామ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లక్ష్మయ్య నాలుగు సార్లు గెలుపొందారు. 1985లో సీపీఎం అభ్యర్థి అసిరెడ్డి నరసింహారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి చురగొండి రాజిరెడ్డిపై గెలిచిన పొన్నాల.. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో అదే చురగొండి రాజిరెడ్డిపై ఓటమి చెందారు.
1999లో ప్రేమలతారెడ్డి (టీడీపీ), 2004లో ఎ.బస్వారెడ్డి (టీడీపీ), 2009లో కొమ్మూరి ప్రతాపరెడ్డి (టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్)పై పొన్నాల గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. కాగా, పొన్నాల లక్ష్మయ్య రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ముగిసినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. ఆయన రాజీనామాను ఆమోదిస్తే ముగిసినట్లేనని, పెద్దలు విస్తృత సంప్రదింపులు జరిపితే ఆయన మెత్తబడి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకా శం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment