అన్నోజిగూడలో జరిగిన మున్నూరుకాపు సంఘం సమావేశంలో నగర మేయర్ రామ్మోహన్ తదితరులు
పోచారం: మున్నూరుకాపులు మరింత అభివృద్ధి సాధించాలంటే..కులస్తులంతా సమన్వయంతో పనిచేయాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ శివాస్ ఫంక్షన్ హాల్‌లో శనివారం జరిగిన మున్నూరుకాపు రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బహుజన కులాల్లో వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టిన వారిలో మున్నూరుకాపులే అధికంగా ఉన్నారని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారంతా లబ్ధి పొందుతారన్నారు.
రాజ్యాధికారంలో వెనుకబాటే..
వ్యవసాయాధారిత వృత్తులకు మున్నూరుకాపులే మూలమని, పటేల్, పట్వారీ వ్యవస్థకు వీరే రూపురేఖలు దిద్దారని నీటి పారుదల చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ వివరించారు. ఆ వ్యవస్థలు రద్దవడంతో మున్నూరుకాపులు రాజ్యాధికారంలో వెనకబడ్డారన్నారు. బీసీలను బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ అనేకంటే బహుజన క్లాస్‌గా పిలవాలని, ఈ మార్పునకు తెలంగాణ నాంది కావాలన్నారు. 1 కోటి 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, దీంతో నిరాదరణకు గురైన గొలుసుకట్టు చెరువులకు పూర్వవైభవం రాబోతుందని వివరించారు. మన కులం నుండి 9 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం శుభపరిణామమన్నారు. 33 జిల్లాల ప్రతినిధులు ఐక్యవేదిక గా ఏర్పడటం సంతోషంగా ఉందన్నారు. రమేశ్ హజారే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆశిస్తున్న బంగారు తెలంగాణ నిర్మాణంలో మున్నూరు కాపులు కూడా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్లు రాసిన మున్నూరు కాపుల చరిత్ర–సంస్కృతి పుస్తకం, సంఘం ప్రత్యేక సంచిక, క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం పలు తీర్మానాలు ఆమోదించారు.
రైతులకు సన్మానం
ఈ సమావేశానికి హాజరైన రైతులను మున్నూరు కాపు సంఘం ఘనంగా సన్మానించింది. మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఐదెకరాల స్థలాన్ని, రూ.ఐదు కోట్లను కేటాయించిన సీఎం కేసీఆర్‌కు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సర్దార్ పుటం పురుషోత్తంను సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం ప్రారంభించేముందు కశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళి అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ టి.శ్రీనివాస్, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్టం పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
తీర్మానాలు:
- 18 శాతం ఉన్న మున్నూరు కాపులను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహించాలని తీర్మానించారు.
- మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని దేవాదాయ శాఖ పరిధి నుండి తొలగించాలన్నారు.
- ఈ కులానికి కేటాయించిన 5 ఎకరాలు, 5 కోట్ల రూపాయలను రెట్టింపు చేయాలని కోరారు.
- ప్రతి జిల్లాలో 2 ఎకరాల స్థలం కేటాయించి, అందులో బాలబాలికలకు హాస్టల్, కల్యాణ మంటపం ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment