సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమై అభివృద్ధిలో ముందువరుసలో నిలిచినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, కేంద్రం అనుసరిస్తున్న అధికార కేంద్రీకృత విధానాల్లో మార్పురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రాధమ్యాలను నిర్ధారించుకుని అమలు చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలని ఆయన కోరారు. గతనెల్లో రాష్ట్రంలో పర్యటించిన 15వ ఆర్థిక సంఘానికి ఓ నివేదిక రూపంలో తన అభిప్రాయాలను, జాతీయ ఆలోచనా విధానాన్ని వెల్లడించారు. ఆదివారం కరీంనగర్ వేదికగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. దేశరాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే తమ లక్ష్యం, కసరత్తు ఇప్పటిది కాదని, చాలా కాలంగా జరుగుతోందని చెప్పారు. ‘విశాల జాతీయ ప్రయోజనాలు– నా ఆందోళన’ అనే పేరుతో 15వ ఆర్థిక సంఘానికి సీఎం కేసీఆర్ నివేదిక ఇచ్చారు.
కేసీఆర్ ఇచ్చిన నివేదికలోని కీలకాంశాలు..
‘ఇప్పటివరకు దేశాభివృద్ధి కోసం తీసుకున్న అరకొరచర్యలు సరిపోవని నేను అభిప్రాయపడుతున్నాను. మన వ్యవస్థ కోసం, ఒక రూపావళి తయారుచేసుకోవాలి. దేశంలో 40 కోట్ల వ్యవసాయ యోగ్యభూమి, 70 వేల టీఎంసీల ఉపరితల నీరు అందుబాటులో ఉంది. కేవలం 40వేల టీఎంసీలతోనే దేశంలోని ప్రతి ఎకరానికి నీరందించవచ్చు. డ్రిప్, స్ప్రింక్లర్, పైపుల తో నీటి సౌకర్యం కల్పించడం ద్వారా తక్కువ నీటితో సేద్యం చేయవచ్చు. ఇప్పటివరకు దేశంలో తీసుకున్న అనేక చర్యల ద్వారా 14% అంటే 5.5కోట్ల ఎకరాల భూమికే కాల్వల ద్వారా నీరు అందించగలుగుతున్నాం. అంతరాష్ట్ర సమస్యలు, న్యాయ వివాదాలు, భూసేకరణలో జాప్యం, పునరావస కల్పన, ప్రణాళిక– ఆచరణలోని లోపాలు నీటి ప్రాజెక్టులకు ప్రధాన ఆటంకాలుగా భావిస్తున్నాను.
అంతర్‌ర్రాష్ట్ర నదీజలా ల వివాదాలపై తీర్పులిచ్చేందుకు ట్రిబ్యునళ్లు దశా బ్దాల సమయం తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రమైనా ఏం చేయగలదు? అసమర్థులైన వ్యక్తులు, సంస్థలు, విధానాల వల్ల ఏ దేశమైనా తన వనరులను వృధా చేసుకుంటుందా? వ్యక్తులతో కూడిన ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయడం కంటే.. దేశంలో నదీజలాల వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునల్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. మరొక ప్రధాన అవరోధం ప్రజాప్రయోజన వాజ్యాల రూపంలో ఎదురవుతోంది. అంతులేని, కళ్లెం వేయలేని, పనికిమాలిన ఈ వాజ్యాలను నిరోధించగలిగే మార్గాన్ని కనుగొనగలిగామా?
పేద దేశాలూ పరపతి పెంచుకుంటున్నాయి
మనకంటే పేద దేశాలు కూడా ఆర్థిక పరపతి పెంచుకుంటూ అద్భుత ప్రగతిని సాధిస్తున్నాయి. 1979వ సంవత్సరం నుంచి చైనా దేశం సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. ఆ అభివృద్ధి 1992 తర్వాత మరింత పుంజుకుంది. 1971 కంటే ముందు మన జీడీపీ కంటే చైనా జీడీపీ తక్కువ ఉండేది. ఇప్పుడు మన కన్నా 4 రెట్లు ఎక్కువ జీడీపీని చైనా సాధించింది. మనమెందుకు ఇది సాధించలేము? గత 4 దశాబ్దాలుగా చైనా సాధిస్తున్న అభివృద్ధి అక్కడి ప్రభుత్వ విజన్‌కు అద్దం పడుతోంది. ఇక దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్‌లతో పాటు మలేసియా, ఇండోనే షియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పైౖన్స్ లాంటి దేశాలు మానవాతీతమైన అభివృద్ధిని సాధిస్తున్నా యి.
హిరోషిమా దాడుల తర్వాత బూడిద స్థాయి నుంచి జపాన్ దేశం ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న దేశంగా ఎదిగింది. మన దేశ అంతర్గత శక్తి, ఆర్థిక వ్యవస్థల పరపతిని మనం పెంచుకోలేమా? ఈ విషయంలో మనల్ని అడ్డుకుంటున్నదేంటి? ఇది అధిగ మించలేని సమస్య కూడా కాదు. సమస్యల్లా మన ఆలోచనా విధానమే. 70 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కనీస అవసరాల కోసం పోరాడాల్సిన పరిస్థితి నుంచి మనం బయటపడడానికి ఓ దిశ కావాలి. దేశంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగం, పేదరికం ఉంది. మంచి విధానాల గురించి ఆలోచించడం కన్నా తదుపరి విధానమేంటనే దానిపై దృష్టి పెట్టాలి. మూస పద్ధతులు మాని భారీ ప్రణాళికలు రూపొందించాలి.
రాష్ట్రాలకు సాధికారత అవసరం
జాతీయ ఎజెండా మారాలి. ఏటా బడ్జెట్‌లు పెట్టడం, సాధారణ పద్ధతుల్లో ముందుకెళ్లడం, సంప్రదాయ విధానాలను అనుసరించడంలో మార్పు రావాలి. పేదరికం అనే ఆలోచన నుంచి విముక్తి పొందడానికి భారీ ప్రణాళికలు అవసరం. మూస ఆలోచనా విధా నం నుండి బయటపడటం తక్షణావసరం. దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు సాధికారత పొందాలి. అభివృద్ధి కేంద్రీకృత జాతీయ ఎజెండా ద్వారా కొత్త భారతాన్ని ఆవిష్కరించుకోవాలి. అధికార కేంద్రీకరణ నుంచి బయటపడాలి. రాష్ట్రాలు ముందుండే కొత్త ఆర్థిక మోడల్ ఈ దేశానికి అవసరం. రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి. దేశంలో గరిష్టంగా 8–10 రాష్ట్రా లు మాత్రమే అభివృద్ధి దిశలో ఉన్నాయి. మిగిలిన దేశంలో జరుగుతున్న అభివృద్ధి ఏమీ లేదు. ఇతర రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు వాటి వనరులు, సామర్థ్య పరపతిని పెంచుకోగలగాలి. రాష్ట్రాలు వాటి స్థాయిలోనే ప్రాధామ్యాలను నిర్ధారించుకునే అవకాశం పెరగాలి.
రాష్ట్రాల జాబి తాలో ఉన్న అంశాల్లో కూడా చాలా కేంద్ర ప్రాయో జిత పథకాలు అమలవుతున్నాయి. సర్కారియా కమిషన్ చర్చల్లో కూడా ఉమ్మడి జాబితా అంశాలను రద్దు చేయాలని రాష్ట్రాలు ప్రతిపాదించాయి. ఉమ్మడి జాబితాలోని అంశాలు గుత్తాధిపత్య ధోరణితో కేం ద్రం ఏకపక్షంగా అమలు చేస్తోందని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. క్రిమినల్ లా, అడవులు, దివాళా సంస్థలు, ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంక్షేమం, న్యాయ, ౖవైద్య, ఇతర వృత్తులు తదితర ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలు చేసింది. గతంలో రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య, అడవులు, తూనికలు, కొలతలు, వన్యప్రాణులు, పక్షుల సంరక్షణ, న్యాయపాలన లాంటి అంశాలను కూడా ఉమ్మ డి జాబితాలో చేర్చారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో ముందస్తు సంప్రదింపులు జరపాలని, ఆ తర్వాత సంయుక్తంగా అంతర్రాష్ట్ర కౌన్సిల్‌లో చర్చిం చాలని సిఫారసు చేసింది.
వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మా ణం, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా, శిశు సంక్షే మం లాంటి ప్రజలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అంశాలను రాష్ట్రాలకు వదిలేయడమే మంచిది. ఈ విషయంలో కేంద్రం పునఃపరిశీలన చేయాలి. ఆయా రంగాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, ప్రాధాన్యాలను నిర్ణయించే అధికారాలను స్థానిక పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలకు ఇచ్చేయాలి. కేంద్రానికి లభించే పన్ను ఆదాయంలో 42% రాష్ట్రాలకు సంక్రమింపజేయడం ఇప్పటివరకు జరగలేదు. సెస్సుల రూపంలో మళ్లీ తీసుకుంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విదేశీ పెట్టుబడుల ఆకర్షణతో పాటు అభివృద్ధిని వెనక్కునెట్టే సమస్యలను పరిష్కరించుకునే దిశలో ఆర్థిక సంస్కరణలు భారతదేశానికి అవసరం. రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో అపార అభివృద్ధి సాధించడం వల్ల మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావితమైన దేశంగా తయారుచేయవచ్చని నేను నమ్ముతున్నాను’అని 15వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో కేసీఆర్ తన జాతీయ ఆలోచనా విధానాన్ని, గుణాత్మక మార్పు నకు అవసరమైన పరిస్థితిని వివరించారు.
చేసి చూపించాం
రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా చేయొ చ్చని మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా మేము చేసి చూపించాం. రాబోయే ఐదారేళ్లలో దేశంలోని ప్రతీ గ్రామానికి నీటిసరఫరా చేసే లక్ష్యంతో ముందుకు సాగాలి. దీనికి 8–10 లక్షల కోట్లు ఖర్చు కావొచ్చు. కనీస మద్దతు ధరను రూ.500 లేదా ప్రస్తుతమున్న ఎమ్మెస్పీకి మూడోవంతు పెంచడమో చేయాలి. ఉద్యోగుల డీఏలో మాదిరిగా ధరల సూచీకి అనుగు ణంగా ఈ ఎమ్మెస్పీని ఏటా పెంచాలి. వ్యవసాయరంగంలో లాభాలు, ఉత్పాదకత తక్కువగా ఉన్నందున రైతులు–వినియోగదారుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు రైతులకు అందిస్తున్నాం. సాగునీటి రంగంలో మహారాష్ట్ర, కర్ణాటకలతో ఉన్న పలు విభేదాలను సంప్రదింపులతో అధిగమిం చగలిగాం. దీనికి కాళేశ్వరం ప్రాజెక్టే ఓ సజీవ సాక్ష్యం’ అని ఆ నివేదికలో కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment