సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్: దేశం అభివృద్ధి చెందాలంటే అక్షర చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని తెలంగాణ గురుకులాల సొసైటీ కార్యదర్శి, స్వేరోస్ ఫౌండర్ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మహబూబ్ నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన స్వేరోస్ 4వ జాతీయ సదస్సుకు తెలంగాణ తోపాటు, ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి గురుకులాల పూర్వ విద్యార్థులు (స్వేరోలు) హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి గురుకులాలు మాత్రమే సరిపోవని, ప్రతి ఇల్లు ఒక పాఠశాల కావాలని, అప్పుడే విద్యావ్యాప్తి జరుగుతుందన్నారు.
పాలకుల నిర్లక్ష్యంతోనే..
దేశంలో పేదరిక నిర్మూలన కోసం విద్య ఎంతో అవసరమని, ఇందులో భాగంగానే అమెరికా విద్యా విధానాన్ని అమలు చేయాలని పురావస్తు శాఖ డైరెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్రంలో విద్యాభ్యున్నతిని పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిందని అన్నారు. ఫలితంగా అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలను నిషేధించడం ద్వారా అనుకున్న ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక గంట కూడా విద్య కోసం కేటాయించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల రద్దు కోసం రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సదస్సులో సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, ఇన్‌కంటాక్స్ కమిషనర్ డాక్టర్ ప్రీతిహరిత్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్‌ఐఆర్‌డీ రాధిక రస్తోగి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రతన్‌లాల్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి తదితరులు పాల్గొన్నారు.
అక్షర చైతన్యంతోనే అభివృద్ధి
Published Mon, Oct 29 2018 2:46 AM | Last Updated on Mon, Oct 29 2018 2:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment