సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ చరిత్రలో మొదటిసారి డీజీపీ మహేందర్‌రెడ్డి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకేసారి రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీ/ఏసీపీలు, డీసీపీలు, ఎస్పీలు, కమిషనర్లతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన టెక్నాలజీతో ఒకేసారి 1,000 మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే టీఎస్‌కాప్ ఆన్‌లైన్ ద్వారా డీజీపీ అధికారులతో సమీక్షించారు.
పోలీస్‌శాఖ ప్రవేశపెట్టిన ఏకరూప పోలీసింగ్‌లో టెక్నాలజీ పరంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలు, వాటి నిర్వహణ, అమలులో వస్తున్న సమస్యలు తదితరాలపై సుమారు 700 మంది అధికారులతో డీజీపీ ఆరా తీశారు. అలాగే స్టేషన్ నిర్వహణలో అమలు చేస్తున్న వర్టికల్ విధానాలపై ప్రతీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ అధికారి, సిబ్బంది వారివారి విధులను పని ఒత్తిడి లేకుండా నిర్వహించేందుకు వర్టికల్ విధానం ఉపయోగపడుతుందని, వర్టికల్ విధానం అమల్లో సబ్‌ఇన్‌స్పెక్టర్ నుంచి ఎస్పీ వరకు ప్రతీ ఒక్కరూ పాటించాలని సూచించారు. యాప్స్ పనితీరు, ప్రజలకు ఎంత సేపట్లో సేవలందుతున్నాయి.. సేవల జాప్యంలో కారణాలేంటన్న విషయాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారు.
సౌకర్యాలలేమిపై దృష్టికి తీసుకురండి..
స్టేషన్లలో సౌకర్యాలలేమి, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలియజేసి పరిష్కరించుకోవాలని డీజీపీ పోలీస్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటుతో ప్రజలకు మెరుగైన సేవలందించడంలో వెనుకాడొద్దని దిశానిర్దేశం చేశారు. స్టేషన్లలో కేసుల దర్యాప్తులో సాంకేతికతను ఉపయోగించుకొని చేధించాలని, పెండింగ్ కేసులపై మానిటరింగ్ అధికారులైన ఏసీపీలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు.
సీసీ కెమెరాలపై అవగాహన కల్పించాలి
ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో అవి కీలకపాత్ర పోషిస్తాయని డీజీపీ చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కాలనీ అసోసియేషన్లు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర రంగాల వారితో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment