డైట్ లెక్చరర్ల డిప్యుటేషన్లు రద్దు | Diet lecturer diputation Cancel | Sakshi
Sakshi News home page

డైట్ లెక్చరర్ల డిప్యుటేషన్లు రద్దు

Published Sat, Oct 8 2016 2:45 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

డైట్ లెక్చరర్ల డిప్యుటేషన్లు రద్దు

డైట్ లెక్చరర్ల డిప్యుటేషన్లు రద్దు

ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
- డైట్‌లలో పనిచేస్తున్న టీచర్లు కూడా తిరిగి పాఠశాలలకు..
- ఉపాధ్యాయ విద్య కాలేజీల్లోని 83 ఖాళీలు ఔట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ
- కొత్త జిల్లాల్లో ఉప విద్యాధికారులు లేనట్లే!
 
 సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖలో ఉప విద్యాధికారులుగా (డిప్యూటీ ఈవో) డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న జిల్లా విద్యా శిక్షణ సంస్థల (డైట్) లెక్చరర్లను వెనక్కి పంపాలని విద్యాశాఖ నిర్ణయించింది. అలాంటి వారంతా తిరిగి డైట్‌లలో విధుల్లో చేరాలని ఆదేశించింది. వీరితోపాటు డైట్ కాలేజీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలని డీఈవోలను ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ డెరైక్టర్ కిషన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో డిప్యూటీ ఈవోలుగా పనిచేస్తున్న 16 మంది డైట్ లెక్చరర్లు, కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (సీటీఈ)లో లెక్చరర్‌గా పనిచేస్తున్న మరొకరు తిరిగి డైట్ కాలేజీల్లో పాఠాలు బోధించనున్నారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు నిర్వహిస్తున్న డైట్ కాలేజీల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న 30 మంది ఉపాధ్యాయులు కూడా తిరిగి పాఠశాలలకు వెళ్లనున్నారు. ఇక డైట్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన గెస్ట్ లెక్చరర్లను నియమించాలని విద్యా శాఖ ఆదేశించింది.

 గెస్ట్ లెక్చరర్ల నియామకం
 ప్రస్తుతం రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో 37 మంది రెగ్యులర్ లెక్చరర్లు పనిచేస్తుండగా.. అర్హత కలిగిన మరో 27 మందిని ఔట్ సోర్సింగ్‌పై గెస్ట్ లెక్చర ర్లుగా నియమించారు. మరో 25 మంది లెక్చరర్ల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అర్హతలున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి.. ఈ 25 పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లను ఔట్ సోర్సింగ్‌పై నియమించాలని నిర్ణయించారు. ఇక ఎనిమిది ఉర్దూ మీడియం డైట్‌లలో ప్రస్తుతం ఏడుగురు రెగ్యులర్ లెక్చరర్లు, ఆరుగురు గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు.

మరో 27 మంది లెక్చరర్లు అవసరం కావడంతో.. ఔట్‌సోర్సింగ్‌పై గెస్ట్ లెక్చరర్లుగా నియమించనున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సును నిర్వహించే నాలుగు కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (సీటీఈ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్‌ఈ)లలో ప్రస్తుతం 59 మంది లెక్చరర్లు ఉన్నారు. మరో 15 మంది రిటైర్డ్ ఉద్యోగులు గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వీటిలో అవసరం మేరకు మరో 31 మందిని గెస్ట్ లెక్చరర్లుగా నియమించనున్నారు. ఓవైపు డైట్, సీటీఈ, ఐఏఎస్‌ఈ కాలేజీల్లో భారీగా ఖాళీలు ఉండగానే.. వాటిలో పనిచే యాల్సిన 17 మంది లెక్చరర్లు డిప్యుటేషన్లపై వెళ్లడమేమిటని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ అధికారులను ప్రశ్నించారు.

 ఉప విద్యాధికారి పోస్టులపై అస్పష్టత!
 కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉప విద్యాధికారి పోస్టులపై అస్పష్టత నెలకొంది. వాటిని ప్రస్తుతానికి భర్తీ చేయడం లేదు. రద్దు చేసే ఉద్దేశం ఉన్నట్లు కూడా విద్యాశాఖ ప్రకటించలేదు. కానీ ప్రస్తుతం ఉప విద్యాధికారుల్లో రెగ్యులర్‌గా, పదోన్నతులపై నియమితులైన వారిని కొత్త జిల్లాలకు ఇన్‌చార్జి డీఈవోలుగా నియమిస్తోంది. డిప్యుటేషన్లపై ఉప విద్యాధికారులుగా ఉన్న లెక్చరర్లను తిరిగి కాలేజీలకు పంపుతోంది.
 
 ఔట్ సోర్సింగ్‌పై భర్తీ చేసే ఖాళీలు ఇవీ
 మహబూబ్‌నగర్ కాలేజీలో 2, రంగారెడ్డిలో 2 (ఉర్దూ మీడియంలో మరో 4), హైదరాబాద్‌లో 4 (ఉర్దూ మీడియంలో మరో 4), మెదక్‌లో 2 (ఉర్దూ మీడియంలో మరో 4), నిజామాబాద్‌లో 2 (ఉర్దూ మీడియంలో మరో 2), ఆదిలాబాద్‌లో 5 (ఉర్దూ మీడియంలో మరో ఐదు), కరీంనగర్‌లో 4 (ఉర్దూ మీడియంలో మరో 5), వరంగల్‌లో 1 (ఉర్దూ మీడియంలో మరో 3), ఖమ్మంలో 2, నల్లగొండలో 1 పోస్టులలో ఔట్‌సోర్సింగ్‌పై గెస్ట్ లెక్చరర్లను నియమిస్తారు. ఇక మహబూబ్‌నగర్ సీటీఈలో 9 పోస్టులను, నాగార్జునసాగర్‌లో 12 పోస్టులను, వరంగల్‌లో 4 పోస్టులను, హైదరాబాద్ ఐఏఎస్‌ఈలో 6 పోస్టులను ఔట్‌సోర్సింగ్‌పై భర్తీ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement