వీరికోటి.. వారికోటి
వీరికోటి.. వారికోటి
Published Wed, May 14 2014 3:09 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
ఎంపీటీసీల్లో కాంగ్రెస్.. జెడ్పీటీసీల్లో టీఆర్‌ఎస్
పల్లె తెలంగాణ ఓటర్ల విభిన్న తీర్పు
ఎవరికీ పూర్తిగా పట్టం కట్టని ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల్లో తెలంగాణ గ్రామీణ ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. తొమ్మిది జిల్లాల ప్రాదేశిక ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ జెడ్పీలను కట్టబెట్టలేదు. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్‌లను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. . దక్షిణ తెలంగాణలో నల్లగొండ, రంగారెడ్డిలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జెడ్పీల్లో హంగ్ నెలకొంది. కాకపోతే గతంలో పెద్దగా ప్రభావం చూపలేని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్ ఈసారి ప్రభావాన్ని కనపరిచింది.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో కూడా పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకోలేకపోయింది.కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చెరో 21 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోగా, నాలుగింట్లో టీడీపీ గెలిచింది. వాటిలో మూడు ఏకంగా కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోవే కావడం విశేషం! మహబూబ్‌న గర్ జెడ్పీలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. పూర్తి మెజారిటీకి మరో ఐదు స్థానాలు కావాల్సి ఉంది. టీడీపీ మద్దతిస్తే ఈ జెడ్పీ కాంగ్రెస్‌కు దక్కే అవకాశముంది. ఖమ్మం జెడ్పీని టీడీపీ కైవసం చేసుకునే పరిస్థితి కన్పిస్తోంది. అక్కడి మూడు స్థానాల్లో ఫలితాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
హంగ్ ఏర్పడిన జిల్లాల్లో జెడ్పీ పీఠం ఎవరికి దక్కాలన్నా టీడీపీ మద్దతు తప్పనిసరిగా మారింది. మొత్తానికి సోమవారం వెలువడ్డ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఒకింత కాంగ్రెస్ వైపు మొగ్గితే, తాజాగా గ్రామీణ ఓటర్లు కారుకు అండగా నిలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదని నిరాశ చెందిన టీఆర్‌ఎస్ నేతలకు ప్రాదేశిక ఫలితాలు ఊరటనిచ్చాయి. ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ కంటే వెనుకబడినా జెడ్పీటీసీ స్థానాల విషయానికి వచ్చేసరికి కారు కాస్త పై చేయి సాధించింది. టీఆర్‌ఎస్ కేవలం ఉత్తర తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతుందన్న వాదనను తిప్పికొడుతూ దక్షిణ తెలంగాణ ప్రాంతంలోనూ అనూహ్య విజయాలు నమోదు చేసింది.
తెలంగాణ తెచ్చింది తామేనన్న కాంగ్రెస్‌కు ప్రాదేశిక ఫలితాలు ఆశించిన రీతిలో రాకపోవడం కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడటం లేదు. 2006లో జరిగిన ఎన్నికల్లో ఆరు జెడ్పీలు గెలిచిన కాంగ్రెస్ ఈసారి రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇక గతంలో రెండు జెడ్పీలు నెగ్గిన టీడీపీ ఈసారి ఒక్కచోటా గెలవలేదు. గతంలో ఒక్క జెడ్పీకే పరిమితమైన టీఆర్‌ఎస్ మాత్రం ఈసారి పెద్ద ఎత్తున జెడ్పీ స్థానాలతో పాటు ఎంపీటీసీ స్థానాలను కూడా బాగా గెలుచుకుంది. మొదట్లోనే చేతులెత్తేసి పోటీకి దూరంగా ఉన్న ఖమ్మంలో మాత్రం టీఆర్‌ఎస్ ఉనికే లేకుండా పోయింది. అయితే అసెంబ్లీ ఫలితాల్లో మాత్రం ఖమ్మంలోనూ తాము ప్రభావం చూపుతామని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పట్ణణాల్లో ఉనికి చాటుకున్న బీజేపీ, ఎంఐఎం పల్లెల్లో మాత్రం సోదిలో కూడా లేకుండా పోవడం గమనార్హం. కేవలం కొన్ని ఎంపీటీసీ స్థానాలతో సరిపెట్టుకున్నాయి.
Advertisement
Advertisement