సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్‌తో గ్రేటర్ గజగజ వణుకుతోంది. మరోవైపు మాన్‌సూన్ సీజన్ ప్రారంభమైంది. రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి భయంతో మూడు నెలలుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సిటీజన్లకు సీజనల్ జ్వరాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా బాధితుల్లోనూ, సీజనల్ వ్యాధుల బారిన పడిన వారిలోనూ కామన్ సిమ్‌టమ్ జ్వరమే. ప్రస్తుతæ పరిస్థితుల్లో ఎవరికి.. ఏ జ్వరం ఉందో? గుర్తించడం కష్టమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అసలు సవాలు ఇప్పుడే..
ప్రస్తుతం సీజన్ మారింది. మాన్‌సూన్ ప్రారంభమైంది. నైరుతి పవనాల ఆగమనంతో వర్షాలు ప్రారంభమయ్యాయి. బస్తీల్లో పారిశుద్ధ్య లోపానికి తోడు ఇళ్ల మధ్య వర్షపు నీరు నిల్వ ఉండటంతో డెంగీ, మలేరియా దోమలు విజృంభించే ప్రమాదం ఉంది. ఇప్పటికే కరోనాతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న సిటిజన్లను.. ఇకపై వెలుగు చూసే సీజనల్ జ్వరాలు మరింత ఆందోళనకు గురి చేయనున్నాయి. ఒకవైపు నగరంలో రోజుకు సగటున 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో వైరస్ మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జులై చివరి నాటికి 60 శాతం మంది వైరస్‌కు ఇన్‌ఫెక్ట్ అవనున్నట్లు స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులే స్పష్టం చేస్తుండటం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఇటు సిటిజన్లకు.. అటు వైద్య ఆరోగ్యశాఖకు అసలైన సవాలు ఇప్పుడే మొదలైందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్ భారిన పడకుండా ఉండాలంటే: డాక్టర్ శ్రీహర్ష, సర్వేలెన్స్ ఆఫీసర్, హైదరాబాద్ జిల్లా
♦ వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలు, మధుమేహులు, హైపర్‌టెన్షన్ బాధితులు, హృద్రోగులు, కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ బాధితులతో పాటు ఇతర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారు సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటికి వెళ్లకపోవడమే ఉత్తమం
♦ మార్కెట్లు, ప్రధాన రహదారులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వైరస్‌కు హాట్‌స్పాట్లుగా మారాయి. పని ప్రదేశాల్లో మనిషికి మనిషి ఆరడుగుల దూరం పాటించడం, ముఖానికి మాస్క్‌లు ధరించడం, చేతులకు గ్లౌజులు వేసుకోవడం, ఏదైనా వస్తువును ముట్టుకున్న వెంటనే సబ్బు లేదా శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు
♦ చెప్పులను ఇంటి బయటే వదిలేయడం, బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ సబ్బుతో స్నానం చేయడం, దుస్తులను వేడినీళ్లలో ఉతకాలి
♦ కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు వాక్సిన్ లేదు. ప్రత్యేక మందులు అంటూ ఏమీ లేవు. వేళకు మంచి పౌష్టికాహారం తీసుకోవడం పాటు సి–విటమిన్ అధికంగా ఉండే తాజా పండ్లను ఎక్కువగా తీసుకోవాలి
♦ జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే: డాక్టర్ ఆఫ్తాబ్ అహ్మద్, ఫిజీషియన్, అపోలో ఆస్పత్రి
♦ బస్తీల్లో పారిశుద్ధ్య లోపానికి తోడు ఇళ్ల మధ్య మురుగు నీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు వ్యాపిస్తాయి. ఆహారం, నీరు కలుషితమై వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతుంటారు. ఇదే సమయంలో డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా, స్వైన్‌ఫ్లూ వంటి జ్వరాలు కూడా విజృంభించే ప్రమాదం ఉంది
♦ ఒకవైపు టైఫాయిడ్, డెంగీ, మలేరియా, స్వైన్Œఫ్లూ వంటి సీజనల్ జ్వరాలు.. మరోవైపు కరోనా వైరస్ జ్వరాలు నమోదవుతుంటాయి. వీటిలో ఏది ఏ జ్వరమో? గుర్తించడం వైద్యులకు కష్టమవుతుంది
♦ వాటర్ ట్యాంకులపై మూతలు ఉండేలా చూడటం, పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా దోమలు విస్తరించకుండా చూడొచ్చు
♦ కిటికీలు, తలుపులకు మెష్‌లను వాడటం, దోమ తెరలు, మస్కిటో కాయిల్స్, రిపెల్లెట్‌లను వాడటం ద్వారా డెంగీ, మలేరియా జ్వరాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు
♦ పిల్లలకు ఫుల్ షర్ట్‌లు, ప్యాంట్‌లు వాడటం ద్వారా దోమలు కుట్టకుండా చూడవచ్చు కాచి వడపోసిన నీళ్లను తాగడం, తాజా పదార్థాలతో తయారు చేసిన వేడివేడి ఆహారాన్ని తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ వంటి జబ్బుల బారిన పడకుండా చూసుకోవచ్చు
♦ ఇప్పటికే ఆస్తమా, సైనసైటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment