
గుప్తనిధుల కోసం తవ్వకాలు
మహబూబ్‌నగర్ : పాత భవనాల కింద విలువైన సంపద దాగి ఉండొచ్చని భావించిన కొందరు దుండగులు తవ్వకాలు నిర్వహించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ గ్రామం ముంపునకు గురికావడంతో గ్రామస్థులంతా ఊరొదిలి కొత్త ప్రాంతానికి వలసవెళ్లారు. దీంతో పాడుబడ్డ గ్రామంగా గుర్తింపు చెందిన పల్లెపాడు క్రమంగా శిధిలావస్థకు చేరుకుంది.
ఈ క్రమంలో పాత భవనాలలో బంగారం, నగలు, విలువైన వస్తువులు లభిస్తాయనుకొని కొందరు గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులతో సహా ఘటనాస్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం గ్రామంలో కొత్త వ్యక్తులు సంచరించినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు.