అర్థరాత్రి అతి రహస్యంగా ఆలయంలో తవ్వకాలు! | Hidden Treasure Hunt in Jannaiguda Temple, Priest Arrest | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి అతి రహస్యంగా ఆలయంలో తవ్వకాలు!

Published Wed, Nov 20 2019 7:38 PM | Last Updated on Wed, Nov 20 2019 7:51 PM

Hidden Treasure Hunt in Jannaiguda Temple, Priest Arrest - Sakshi

అతని పేరు.. సత్యం శివం సుందరం. ఈ పేరు చూసే పెద్ద స్వామీజీ వచ్చారు అనుకొని ఆలయంలో పూజారి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ గుడినే దిగమింగేందుకు వచ్చిన కాలాంతకుడు అని అప్పుడు గ్రహించలేకపోయారు. ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయనీ, వాటి కోసమే అతడు స్వామీజీ వేషం కట్టాడన్న విషయం నాలుగేళ్ల తర్వాతగానీ గుర్తించలేకపోయారు. చివరికి అతను ఓ స్మగ్లర్, మనీల్యాండరర్.. పక్కా 420 అని తెలుసుకొని పోలీసులకు పట్టిచ్చారు.

ఇదిగో ఆలయంలో వీళ్లు ఏం చేస్తున్నారో తెలుసా? ఇక్కడ కూర్చున్న ఆలయ పూజారి తాను పూజలు చేసే గుడిలో ఏం చేయిస్తున్నాడో తెలుసా? వీళ్లు తవ్వుతున్నది ఆలయంలో కొత్త నిర్మాణ పనుల కోసం కాదు.. అర్థరాత్రి వేళ అతి రహస్యంగా ఓ ముఠా వచ్చి ఆలయ గర్భగడి ముందు సాగిస్తున్న గుప్త నిధుల వేట ఇది. ఈ ముఠా నాయకుడు ఇక్కడ కూర్చొని తవ్వకాలు చేయిస్తున్న ఆలయ పూజారే. ఆలయ పూజారేంటి? గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయించడం ఏంటి అన్న డౌట్ వస్తుందా? నిజానికి ఇతను పూజారి కాదు. గుప్తనిధుల వేట కోసం వేసుకున్న వేషమే ఈ స్వామీజీ వేషం. ఇతగాడి పేరు.. సత్యం శివం సుందరం. పేరు ఎంత సినిమాటిగ్గా ఉందో.. తీరు అంతకు మించిన డ్రమటిగ్గా ఉంటుంది. ఆ డ్రామాను రక్తి కట్టించే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామం సమీపంలోని జన్నాయిగుట్టపైకి చేరాడు. అక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇతగాడు ఐదేళ్ల క్రితమే టార్గెట్ చేశాడు. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. చత్రపతి శివాజీ దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఈ ఆలయంలోనే బస చేశారని స్థలపురాణం చెబుతోంది. శివాజీనే అప్పట్లో ఆలయ అభివృద్ధికీ విశేషంగా కృషి చేశారట. అందుకే ఈ ఆలయ ఆవరణలో గుప్త నిధులు ఉంటాయని కన్నేశాడు ఈ 420. అసలు పేరు తెలియదు.. కానీ ఇక్కడున్న వారికి తానొక స్వామీజీని అంటూ పరిచయం చేసుకున్నాడు. పరపతి కోసం చిన్నజీయర్ స్వామి పేరునూ అడ్డంగా వాడేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం స్థానికుల్ని నమ్మించి ఆలయంలో పూజారిగా చేరాడు. వాళ్లు కూడా ఆలయంలో ఎప్పుడూ ఒకరు ఉండటం మంచిదేనని భావించి అతనికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి ఆదరించారు.

ఆలయం ఉన్న జన్నాయిగుట్టకూ రావిరాల గ్రామానికీ చాలా దూరం ఉండటం.. ఉదయం సాయంత్రం మాత్రమే భక్తులు రావడం వల్ల మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఈ దొంగ బాబా తవ్వకాలు సాగించేవాడు. ఆధునిక యంత్రాలను, స్కానర్లను ఉపయోగించి ఆలయంలో నిధుల కోసం అన్వేషించాడు. వాటి ప్రకారం పలుచోట్ల తవ్వకాలు జరిపాడు. ఇలా రాత్రి మొత్తం తవ్వకాలు జరిపే ఈ ముఠా.. మూడోకంటికి తెలియకుండా ఆ గోతులు పూడ్చివేసేది. ఈ దొంగ బాబా ముఠాలో ఉండే ఓ వ్యక్తి ఇతగాడితో విభేదించి.. తాను రహస్యంగా తీసిన వీడియోను గ్రామస్తులకు షేర్ చేశాడు. దాన్ని చూసి షాక్ తిన్న గ్రామస్తులు.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ నెల 15న ఈ అసత్యబాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇతడి గత చరిత్రను తవ్వే పనిలో ఉన్నారు.

ఈ దొంగ బాబా పూజారి ముసుగులో వేసుకున్న స్మగ్లర్, మనీ ల్యాండరర్, పక్కా 420 అని కూడా బయటపడుతోంది. గతంలో మహిళలతో ఆలయంలో అసభ్యంగా ప్రవర్తించాడనీ, స్థానికుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడనీ ఇప్పుడిప్పుడే బయటికొస్తోంది. అంతేకాదు తరచూ మహారాష్ట్ర వెళ్లి వచ్చేవాడనీ, అంతర్ రాష్ట్ర గుప్తనిధుల ముఠాలతో ఇతనికి సంబంధాలున్నాయని రావిరాల గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తం విచారణ పూర్తైతేగానీ ఈ సత్యం శివం సుందరం చేసిన అకృత్యాలన్నీ బయటపడవని అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement