వీహెచ్పై దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు (విహెచ్)కు చేదు అనుభవం ఎదురైంది. ఆ సదస్సులో పార్టీ కార్యకర్తలతో మాట్లాడించాలంటూ వేదికపై హన్మంతరావు పట్టుబట్టారు. ఆ విషయం తర్వాత చూద్దామంటూ పలువురు నేతలు వీహెచ్ను బుజ్జగించారు. దాంతో ఆగ్రహించిన వీహెచ్ కార్యకర్తలతో మాట్లాడించనప్పుడు ఈ సదస్సు ఎందుకంటూ ఆ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన దిగ్విజయ్ సింగ్ను నిలదీశారు.
దాంతో ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేయొద్దంటూ వీహెచ్కు దిగ్విజయ్ సింగ్ సూచించారు. కార్యకర్తలతో మాట్లాడించాల్సిందే అంటూ వీహెచ్ పట్టుపట్టారు. దాంతో వీహెచ్ వ్యవహారంపై దిగ్విజయ్ సింగ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. దాంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత కే.జానారెడ్డి జోక్యం చేసుకుని వీహెచ్ను పక్కకు తీసుకువెళ్లి బుజ్జగించారు. దాంతో ఆ సమస్య సద్దుమణిగి... సమావేశం ప్రారంభమైంది. అయితే కాంగ్రెస్ నేతల నుంచి ఆ సదస్సుకు అంతంతమాత్రంగానే హజరైయ్యారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి, పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహింపట్నంలో సదస్సును ఏర్పాటు చేసింది. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఆ సదస్సుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్తోపాటు పార్టీ పెద్దలు పలువురు హాజరయ్యారు. ఈ సదస్సు సోమవారం ముగియనుంది.