
సీబీఐ విచారణ జరపాల్సిందే!
♦ మియాపూర్ భూ కుంభకోణంపై కాంగ్రెస్ నేతల డిమాండ్
♦ కేంద్ర హోం మంత్రి అపాయింట్‌మెంట్ రద్దుపై మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ: మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించా ల్సిందేనని ఈ విషయంలో నిజానిజాలు తేలేంతవరకు తాము పోరాటాన్ని కొనసాగి స్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ అంశంపై తాము కలుస్తామని కోరగా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం అపాయింట్‌మెంట్ ఇచ్చి తర్వాత రద్దు చేయడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిప డ్డారు. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినం దుకు ప్రతిఫలంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కాపాడాలని కేంద్రం ప్రయత్నిస్తోందా? అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో టీఆర్‌ఎస్ నేతలపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కేందంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకాడడం దురదృష్టకర మని దిగ్విజయ్ పేర్కొన్నారు.
కేంద్రానికి చెందిన భూములు కూడా ఈ కుంభకోణంలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు లేకుం డానే కేంద్రం సీబీఐ విచారణకు ఆదే శించవచ్చునని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కాగా, మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాల్పిందేనని సీఎల్పీ నేత జానా రెడ్డి డిమాండ్ చేశారు. మియాపూర్ భూకుంభకోణంపై సీబీఐ విచారణ కోరడానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరామని, అయితే బుధవారం అపాయింట్ మెంట్ ఇచ్చి తర్వాత ఆరోగ్యకారణాల వల్ల రద్దు చేస్తున్నట్టు చెప్పారని ఆయన వెల్లడించారు. మరో రోజు తమకు సమయం కేటాయించాల్సిందని, అసలు అపాయిం ట్‌మెంట్ లేదనడం అప్రజాస్వామికమని జానారెడ్డి విమర్శించారు. న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
టీఆర్‌ఎస్‌తో చీకటి ఒప్పందం: ఉత్తమ్
టీఆర్‌ఎస్ ప్రభుత్వంమీద వచ్చిన ఆరోపణలపై విచారణకు బీజేపీ సర్కార్ ఎందుకు వెనుకాడుతోందని, ఇది చీకటి ఒప్పందం కాదా అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. పది నుంచి పదిహేనువేల కోట్ల రూపాయల కుంభకోణంపై విచారణకు కేంద్రం ఎందుకు వెనుకాడుతోందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ ఇచ్చి రద్దు చేశారని, కనీస ఆయన వ్యక్తిగత కార్యదర్శికి కూడా వినతి పత్రం అందించడానికి అంగీకరించలేదని తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు అంగీకరించాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.