సాధారణ ఎన్నికల్లో బహుముఖ పోటీలు, నువ్వా-నేనా అన్నట్టుండే ముఖాముఖి పోటీలు పెరిగినపుడు సహజంగానే గెలుపోటముల మధ్య వ్యత్యాసం తగ్గిపోతుంది. స్వల్ప ఓట్ల తేడాతోనే ఫలితాలు అంతిమ విజేతల్ని నిర్ణయిస్తాయి. ఉత్కంఠ పోరులో ఆ స్వల్ప పెచ్చు ఎవరికి రానుందో ఓట్ల లెక్కింపు ముగిసే వరకూ తెలియదు. అప్పటిదాకా తమదే గెలుపనే ధీమాతో ఉండే అత్యధికుల ఆశలు గల్లంతవుతాయి. ఇప్పుడు తెలంగాణలో మూడో వంతు నుంచి సగం వరకు నియోజకవర్గాల్లో అటువంటి పరిస్థితులున్నాయి. మిగతా పోటీ దారుల్ని వెనక్కి నెట్టి ప్రధాన పక్షాల అభ్యర్థులు నువ్వా నేనా అన్నంత తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న నియోజకవర్గాల సంఖ్య పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పెరుగుతోంది.
ఇవి కాక, ప్రధాన పక్షాలైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అభ్యర్థులు కాకుండా బీజేపీ, బీఎస్పీ, బీఎల్‌ఎఫ్ (కూటమి)ల అభ్యర్థులు బరిలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీలున్నాయి. ప్రధాన పక్షాల నుంచి బరిలో బలమైన తిరుగుబాటు అభ్యర్థులు దూసుకొస్తున్న చోట కూడా త్రిముఖ పోటీ రోజురోజుకీ బలపడుతోంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చి చూస్తే సామాజిక అవగాహన, రాజకీయ పరిణతి, మీడియా చేతన అధికంగా ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఫలితాలు తేలే నియోజకవర్గాల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఈ పరిస్థితి రాజకీయ పరిశీలకుల అంచనాల్ని కూడా గల్లంతు చేస్తోంది. ఫలితాల తర్వాత అధికారం మాదంటే మాదని ప్రధానపక్షాలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ బల్లగుద్ది చెబుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ స్వల్ప ఓట్ల వ్యత్యాసపు గెలుపోటములు ఎవరి కొంపముంచుతాయన్నది ఉత్కంఠ రేపుతోంది.
జనం ముందు సిద్ధాంత రాద్ధాంతాలు నిలువవు
పలు సమకాలీన అంశాల్ని పరిగణనలోకి తీసుకొని రాజకీయ పరిశీలకులు, ఎన్నికల విశ్లేషకులు, సెఫాలజిస్టులు రకరకాల అంచనాలు చెబుతారు. కానీ, అత్యధిక సందర్భాల్లో ప్రజా తీర్పు విస్మయం కలిగిస్తుంది. అంచనాల్ని గల్లంతు చేస్తుంది. ఫలితం హంగ్ అనో, గెలుపెవరిదైనా కావచ్చనో అంచనాలు సాగే సందర్భాల్లోనూ... ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన దాఖలాలే ఎక్కువ. పార్టీల ప్రచారపు ఎత్తుగడలు, వ్యూహాలతో నిమిత్తం లేకుండా, ఆసిఫాబాద్ నుంచి భద్రాచలం వరకు ఓటర్లు ఒకరికొకరు మాట్లాడుకొని ఓట్లేసినట్టే ఉంటుంది. మనకు తెలియని ‘న్యూరో నెట్‌వర్క్’ ఏదో అంతర్లీనంగా పనిచేసిందన్నట్టు ఏకరీతి ఫలితాల్ని ప్రజలు శాసిస్తారు. ఒక శాస్త్రీయ అధ్యయనం, పరిశీలన ద్వారా క్షేత్రంలో ఉన్న పరిస్థితిని ముందుగా ప్రతిబింబించేవే ‘సర్వే’లని మనబోటి సామాన్యులనుకుంటారు. కానీ, సర్వేల పేరిట పలికే గణాంకాలతో, ఆయా పార్టీలకిచ్చే హెచ్చు-తగ్గులతో రాబోయే ప్రజాతీర్పునే ప్రభావితం చేయాలని కొందరు ‘మేధావులు’ యోచిస్తుంటారు. రాజకీయ పక్షాలకు కొమ్ముకాసే కొన్ని మీడియా సంస్థలు కూడా ఇటువంటి మేధావిత్వాన్ని తరచూ ప్రదర్శిస్తాయి. అందువల్లే, కాలక్రమంలో సర్వేలంటేనే విశ్వసనీయత లేకుండా పోతోంది.
గణాంకాలు కొన్ని సార్లు విచిత్రంగానూ ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న తెలంగాణ (ఆపద్ధర్మ) ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖరరావును ఇంటర్వ్యూ చేస్తూ సీనియర్ జర్నలిస్టు, ఎన్నికల విశ్లేషకుడు ప్రణయ్‌రాయ్ (ఎన్డీటీవీ) ఒక ప్రశ్న అడిగారు. ‘కిందటిసారి ఎన్నికల్లో మీ ఓట్ల శాతం 33 మాత్రమే, ఈ సారి కాంగ్రెస్-తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి, దీన్ని ఎలా అధిగమిస్తారు?’ అన్నదా ప్రశ్న. దీనికి సంబంధం లేకుండా ఆయనేదో సమాధానం చెప్పారు, అసలు చంద్రబాబునాయుడికి ఇక్కడి రాజకీయాల్లో జొరబడే నైతిక హక్కే లేదని కొట్టివేశారు. ఇక్కడి ప్రాజెక్టుల్ని, ప్రగతిని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నాడన్నారు. అదొకరకంగా ప్రణయ్ ప్రశ్నకు సమాధానమే కావచ్చు! ఇద్దరు కలిస్తే పెరుగుతాయనే ఎందుకనుకుంటున్నారు? తగ్గొచ్చు, అన్నది కేసీఆర్ కవి హృదయమేమో తెలియదు! ఎలా అంటే, 2 కు 2 కలిపితే 4 అయేది గణితంలోనే! రాజకీయాల్లో అది 4 అవొచ్చు, ఆరో, ఎనిమిదో కావచ్చు. అవేవీ కాకుండా సున్నా కూడా కావచ్చు. ఓట్ల శాతాల్లోని వ్యత్యాసాలకు పొందే సీట్ల హెచ్చుతగ్గులకు పొంతనలేని సందర్భాలెన్నో!
ప్రజలు గమనిస్తున్నారని గ్రహించాలి
రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని చిత్తు చేసి, తమను మెరుగుపరచుకునే ఎత్తులు, జిత్తులు ఎన్ని చేసినా ప్రజలు గమనిస్తున్నారనేది తప్పక గ్రహించాలి. ప్రజల్ని ఏ మాత్రం లెక్క చేయకుండా రాజకీయ వ్యూహాలు రచించి, ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వెచ్చించి, విచ్చలవిడిగా వెదజల్లినంత మాత్రాన ఫలితాలు తమకే అనుకూలిస్తాయనుకోవడం భ్రమ. స్థూలంగా కూటమి నుంచి, ప్రత్యేకంగా ‘తెలంగాణ జన సమితి’ నుంచి బయటకు వెళ్తూ యువ న్యాయవాది, హక్కుల కార్యకర్త రచనారెడ్డి ఒక మాటన్నారు. ‘‘కూటమిలో మీరు మీ స్వార్థం, తగాదాలతో... ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఎంపిక చేసుకునేందుకు ‘ప్రత్యామ్నాయం’ అవకాశాన్నే లేకుండా చేసి తెలంగాణ సమాజాన్ని వంచించారు, ప్రజల్ని మోసపుచ్చారు’’ అన్నది ఆలోచించదగ్గ వ్యాఖ్యే!
గత ఎన్నికలన్నీ గుణపాఠాలే!
ఒకే ప్రత్యర్థి పార్టీల మధ్య కిందటి సారి ఎన్నికల్లో ఓట్ల వ్యత్యాసాలకు, తర్వాత మారిన మొగ్గుకు, తాజా పరిస్థితికి ఉండే లంకెని రాజకీయ వ్యూహకర్తలు పరిశీలించాలి. గత గణాంకాలను బట్టి ఇప్పుడేం పనిచేస్తుందో యోచించి అన్వయించాలి. కిందటి ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయగానే, అప్పట్లో వారికి లభించిన ఓట్ల శాతాల్ని ఇప్పుడు కలిపి లెక్కించలేం. ఒకే ఎన్నికలో కూడా, ఓట్ల శాతాలకు సీట్ల సంఖ్యకు ఉండే సంబద్ధత ఏకరీతిన ఉండాలని కూడా లేదు. 2014లో ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికలు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా వర్తిం చాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్ని గతేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఆశ్చర్యకరమైన తేడాలున్నాయి. స్వల్ప వ్యత్యాసపు గెలుపోటములు ఒక రాజకీయ పార్టీకి ఎలా అనుకూలించాయో ఏపీ గణాంకాల విశ్లేషణ స్పష్టం చేస్తోంది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో బీజేపీకి 49.1% ఓట్లు (99 సీట్లు)రాగా కాంగ్రెస్‌కు 41.4 శాతం ఓట్లు(77 సీట్లు) లభించాయి. అంటే దాదాపు 8 శాతం (7.7 శాతం) ఓట్ల వ్యత్యాసమున్నపుడు సాధించిన సీట్లలో తేడా 22 మాత్రమే! కానీ, ఏపీకి వచ్చే సరికి పరిస్థితి భిన్నం! టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల వ్యత్యాసం 2 శాతం కన్నా తక్కువ. 175 స్థానాలున్న ఏపీలో టీడీపీకి 46.30 శాతం ఓట్లు (102 సీట్లు) రాగా వైఎస్సార్‌సీపీకి 44.47 శాతం ఓట్లు (67 సీట్లు) లభించాయి. అంటే 2 కన్నా తక్కువ (1.83 శాతం) ఓట్ల వ్యత్యాసమున్నా 35 సీట్లు తక్కువ లభించాయి.
-దిలీప్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment