సాక్షి, హైదరాబాద్: జనవరి 17, 2016.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) చరిత్రలో ఓ బ్లాక్‌డే. విశ్వవిద్యాలయాల్లో వివక్ష తీవ్రతను పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల మరణం ఎలుగెత్తి చాటిన రోజది. రోహిత్ ఆత్మహత్యకు దాదాపు రెండేళ్లు నిండ బోతున్నాయి. ఇప్పుడు మరోమారు వివక్షకు నిరసనగా హెచ్‌సీయూలో వెలివాడ వెలిసింది. అణచివేతను ధిక్కరిస్తూ అగ్గిరాజుకుంది.
75 శాతం హాజరు లేదన్న కారణంగా విద్యార్థి సంఘ ఎన్నికల్లో 264 ఓట్ల మెజారిటీతో వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆదివాసీ విద్యార్థి లునావత్ నరేశ్ గెలుపుని ప్రకటించకపోవడం యూనివర్సిటీలో ఆందోళనలకు దారితీ సింది. హాజరుపట్టీలో ప్రజెంట్‌ని ఆబ్సెంట్‌గా తారుమారు చేసి నరేశ్ గెలుపుని ఓడించాలన్న ఆత్రుతలో వర్సిటీ తప్పులపై తప్పులు చేస్తూ పోయింది. వీసీ అప్పారావు ఏబీవీపీతో కుమ్మౖక్కై వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందిన నరేశ్‌ని అడ్డుకోవడానికి గ్రీవెన్స్ సెల్‌ని పావుగా వాడుకున్నారని ఆరోపిస్తూ ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆందోళనకు దిగింది.
రెండు రోజులుగా నిరాహార దీక్ష..
నిజానికి విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేయడానికి సరిపడా.. అంటే 75 శాతం హాజరుతోనే లునావత్ నరేష్ పోటీకి అర్హత సాధించారు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఏబీవీపీ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకుని, తారుమారు చేసిన హాజరుపట్టీని చూపించి నరేష్ ఎన్నిక చెల్లదని, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం ప్రకటించడంతో విద్యార్థులు తిరగబడ్డారు. ఎన్నికలు జరిగిన తర్వాత అటెండెన్స్ రిజిస్టర్‌లో ప్రెజెంట్‌ని ఆబ్సెంట్‌గా> మార్చారని, 75 శాతం హాజరున్నదంటూ డిపార్ట్‌మెంట్ స్వయంగా ముద్రవేసి ఇచ్చిన సర్టిఫికెట్‌ని బుట్టదాఖలు చేసి గ్రీవెన్స్ సెల్, వీసీ అప్పారావు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. హాజరుపట్టీని తారుమారు చేశారనడానికి స్పష్టమైన ఆధారాలతో ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం లేకపోవడంతో రెండు రోజులుగా వెలివాడలో నిరాహార దీక్షకు ఉపక్రమించింది. వర్సిటీ నుంచి స్పందన లేకపోవడంతో ఆల్ స్టూడెంట్ యూనియన్స్‌తో సమావేశమై గురువారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సిద్ధమవుతోంది.
గిరిజనుడిని కనుకనే వివక్ష..
మొత్తం ప్యానల్‌లో నేనొక్కడినే గిరిజనుడిని. అందుకే ఈ వివక్ష. అటెండెన్స్ రిజిస్టర్‌లో నేను ప్రెజెంట్ అయిన చోట ఆబ్సెంట్ అని దిద్దారు. కొన్ని చోట్ల డేట్స్ లేకుండా అటెండెన్స్ వేశారు. యాజమాన్యం నా పట్ల కక్షపూరితంగా వ్యవహరించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ముందు 75 శాతం హాజరు ఉన్నట్టుగా డిపార్ట్‌మెంట్ సర్టిఫికెట్ ఇచ్చి ఆ తర్వాత 64 శాతం ఉందని ఒకసారి, 71 శాతం ఉందని మరోసారి రిపోర్ట్ ఇచ్చింది. దీన్నిబట్టే నిజాన్ని అబద్ధంగా మార్చేందుకు ఎలాంటి ప్రయత్నం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. యాజమాన్యానికి అనుకూలంగా ఉంటే ఎన్నేళ్లైనా డీన్‌గా ఉండొచ్చు. నిజానికి ప్రతి నాలుగేళ్లకీ డీన్స్ మారతారు. మెడికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ ప్రారంభించినప్పటి నుంచి సుదీర్ఘకాలంగా గీతా వేముగంటి డీన్‌గా కొనసాగుతున్నారు. రోహిత్ సహా ఐదుగురు విద్యార్థుల రస్టికేషన్‌కి సూత్రధారి గీతా వేముగంటి. ఇప్పుడు నా విషయంలో తప్పుడు రిపోర్టు ఇచ్చింది కూడా ఆమే. – వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన లునావత్ నరేష్
కుట్రపూరితంగా అటెండెన్స్‌లో గోల్‌మాల్
ఏబీవీపీని కాపాడాలనే కుట్రలో భాగమే ఇదంతా. వీసీ అప్పారావు, గ్రీవెన్స్ సెల్ కుమ్మక్కై ఆడుతున్న నాటకం ఇదీ. రీఎలక్షన్స్‌కి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి మేం అనేక ఆందోళనలు చేశాం. కానీ యాజమాన్యంలో స్పందన లేదు. వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు హాజరు శాతాన్ని నిర్థారించేందుకు కమిటీ వేస్తున్నామన్నారు. ఏబీవీపీతో కుమ్మక్కై అటెండెన్స్‌లో గోల్‌మాల్ చేసి సమస్యను తాత్సారం చేస్తున్నారు. అందుకే నిరవధిక నిరాహార దీక్షను చేపట్టబోతున్నాం. -సుందర్ రాథోడ్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు
ఆరోపణలు నిజం చేసేందుకు కుట్ర..
లునావత్ నరేష్ ఏబీవీపీ అభ్యర్థి అపూర్వ్‌పై గెలిచాడు. అయితే అతని ఎన్నిక చెల్లదని ఫిర్యాదు చేసింది ఏబీవీపీ అధ్యక్షుడు. ఏ ఆధారంలేని ఆరోపణలను నిజం చేసేందుకు వీసీతో కలసి గ్రీవెన్స్ సెల్ కుట్ర పన్నింది. జూలై 16న క్లాసులు మొదలైతే.. ఆగస్టు 8 నుంచి అటెండెన్స్ రిజిస్టర్ ప్రారంభించారు. అంతకుముందు హాజరైనా పరిగణనలోనికి తీసుకోలేదు.– ప్రశాంత్, సామాజిక న్యాయ ఐక్యపోరాట కమిటీ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment