సాక్షి, హైదరాబాద్: కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడం..వ్యాధికణాలకు మాత్రమే మందు అందించేలా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ చేసిన ప్రయత్నం సఫలమైంది. కేన్సర్ సోకిందంటే మరణం తప్పదనేది ఒకప్పటిమాట.
కానీ ఇప్పుడు జీవితాన్ని మరింతగా పొడిగించేందుకు ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందులో కీమోథెరపీ కూడా ఒకటి. అయితే ప్రత్యేక రసాయనాలతో అందించే ఈ చికిత్సలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కేన్సర్ కణాలతోపాటు ఆరోగ్యంగా ఉన్న ఇతర కణాలు కూడా నాశనమయ్యేవి. రోగనిరోధక శక్తి తగ్గి వెంట్రుకలు రాలిపోవడం, ఒళ్లంతా దద్దుర్లు, నోట్లో పుండ్లు లాంటి దుష్ప్రభావాలు అనేకం ఉండేవి.
ఒకవేళ వీటన్నింటిని తట్టుకున్నా, కీమో రసాయనాల నుంచి తప్పించుకున్న కొన్ని కణాలతో మళ్లీ కేన్సర్ తిరగబెట్టే ప్రమాదమూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడంతోపాటు, ఇచ్చే మందు నేరుగా కేన్సర్ కణాలకు మాత్రమే చేరేలా చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.
నానో కణాలు తయారు చేసి..పేటెంట్ పొంది..
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగపు అధ్యాపకుడు కొండపి ఆనంద్ తన పరిశోధనల ద్వారా నానో కణాలను తయారు చేశారు. అంతేకాకుండా తయారీ పద్ధతిని కూడా ఆవిష్కరించారు. పేటెంట్ హక్కులు కూడా పొందారు.
ప్రస్తుతం ఇలా...
కేన్సర్ చికిత్సలో భాగంగా కీమో రసాయనా లతో పాటు కణాలకు అవసరమైన డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ వంటి సేంద్రియ పదార్థాలను కలిపి అందిస్తున్నారు. కానీ దీంతో ఫలితాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ సేంద్రియ పదార్థాలకు ఏది కేన్సర్ కణమో, ఏది సాధారణమైందో తెలియదు. అందువల్ల ప్రభావం తక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించేందుకు మాత్రమే ఈ సేంద్రియ పదార్థాలు ఉపయోగపడతాయి.
రెండూ కేన్సర్ కణాలకు మోసుకెళ్లగలిగితే...
కీమో రసాయనాలు, సేంద్రియ పదార్థాలు రెండింటినీ కలిపి కేన్సర్ కణాలకు మోసుకెళ్లగలిగితే చాలా లాభాలుంటాయని ప్రొఫెసర్ కొండపి ఆనంద్ గుర్తించారు. ఈ పని సాధించే టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు. కేన్సర్ కణాలకు చక్కెరలన్నా, ఇనుము అన్నా చాలా ఇష్టమని చాలాకాలంగా తెలుసు. ఈ కారణంగానే ఏమో కేన్సర్ కణాల్లో ఈ రెండు పదార్థాలను ఒడిసిపట్టుకోగల రిసెప్టర్లు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఈ విషయాలను అనుకూలంగా మార్చుకొని కేన్సర్‌పై పట్టు సాధించేందుకు కొండపి ఆనంద్ నేతృత్వంలో డాక్టర్ సొనాలి ఖన్రా, డాక్టర్ ఎస్‌ఎల్.బాలకృష్ణ, డాక్టర్ జగదీశ్ సేనాపతి, డాక్టర్ చుఖూ ముజ్, డాక్టర్ నేహాతోమర్, అంతం సోనీలతో కూడిన శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించింది. పాలలోఉండే లాక్టోఫెర్రిన్, రక్తంలోని ప్రొటీన్లతో వీరి పరిశోధనలు సాగాయి. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ వంటి సేంద్రియ పదార్థాలను, కీమో రసాయనాన్ని నానోస్థాయి అపోట్రాన్స్‌ఫెరిన్ ప్రొటీన్‌లోకి చేర్చడంలో విజయం సాధించారు.
నోటితోనూ వేసుకోవచ్చు...
కీమోథెరపీకి నరాల్లోకి ఎక్కించే పద్ధతి ఒక్కటే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. సహజసిద్ధమైన లాక్టోఫెర్రిన్, అపోట్రాన్స్‌ఫెరిన్‌లతో తయారైన నానోస్థాయి కణాలను మాత్రం నేరుగా నోటిద్వారా కూడా అందించవచ్చని ప్రొఫెసర్ కొండపి ఆనంద్ ‘సాక్షి’కి తెలిపారు.
ఈ పద్ధతిలో వాడిన ప్రొటీన్లన్నీ సహజసిద్ధమైనవి కాబట్టి ఆరోగ్యకరమైన కణాలకు హాని జరగదని చెప్పారు. ఈ నానోస్థాయి కణాలు కేన్సర్ కణాల్లోని రిసెప్టర్లకు అతుక్కుపోవడం వల్ల అపోట్రాన్స్‌ఫెరిన్ విడిపోయి అందులోని కీమో రసాయనం బయటపడుతుందని, కేన్సర్ కణాన్ని నాశనం చేస్తుందని వివరించారు. సాధారణ కణాల్లో అపోట్రాన్స్‌ఫెరిన్, లాక్టోఫెర్రిన్‌లు ఉంటాయి కాబట్టి ప్రమాదమేమీ ఉండదన్నారు.
ఈ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించి 2017లో తాము భారతీయ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఈ నెల 20వ తేదీన లభించిందని తెలిపారు. ఫార్మా కంపెనీలు చొరవ తీసుకుని ముందుకొస్తే అతితక్కువ దుష్ప్రభావాలు ఉండే కీమోథెరపీకి నాంది పలకవచ్చని చెప్పారు. అంతేకాకుండా, భవిష్యత్‌లో ఈ టెక్నాలజీ జన్యుచికిత్సలకూ ఉపయోగపడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment