చైతన్యంతోనే రుగ్మతలు దూరం
విద్యారణ్యపురి : ప్రజల్లో చైతన్యం కలిగించడం ద్వారా సామాజిక రుగ్మతలు దూరం కావడమే కాకుండా వ్యాధులు ప్రబలకుండా రక్షించొచ్చని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా ఇప్పటికీ ఎందరో వ్యాధులు బారిన పడుతున్నారని తెలిపారు.
ఈ మేరకు సంబంధిత అధికారులు సామాజిక బాధ్యతగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ స్థాయి వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. ‘మెడికల్ డయాగ్నస్టిక్ అండ్ మైక్రో బయాలజికల్ అనాలిస్ ఆఫ్ పోటబుల్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్’ అంశంపై నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్ మరో రెండు రోజుల పాటు కొనసాగుతుంది. వర్క్‌షాప్‌ను డిప్యూటీ సీఎం రాజయ్య ప్రారంభించి మాట్లాడారు.
మైక్రో బయాలజిస్టులే కీలకం
ప్రజల్లో అవగాహన లేకపోవడం, నిపుణులైన సిబ్బంది కొరత కారణంగా వ్యాధి ఒకటైతే పరీక్ష, మందులు మరో రకంగా ఉంటున్నాయని డిప్యూటీ రాజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. దీని నివారణకు నిపుణులైన మైక్రో బయాలజిస్టుల పాత్ర కీలకమన్నారు. కేడీసీ విద్యార్థులు వర్క్‌షాప్ లక్ష్యాన్ని అవగాహన చేసుకుని తమ గ్రామ ప్రజల్లో కలుషిత, ఆహారం వల్ల సంభవించే వ్యాధులు, వాటి నివారణపై అవగాహన కల్పించాలని కోరారు. తాను కూడా ఇక్కడి జూనియర్ కళాశాలలో చదువుకున్నానని రాజయ్య గుర్తు చేసుకున్నారు.
అలాగే, ప్రస్తుతం ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా ఇందులో ఆరోగ్య సమస్య ప్రధానమైనదని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా ఉండడం వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. గ్రామీణ, పట్టణ స్థాయిలో పారిశుద్ధ విభాగం అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తే 60నుంచి 70 శాతం వ్యాధుల నివారణ సాధ్యమవుతుందన్నారు. అంతేకాకుండా ప్రతీ ఒక్కరు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించి వ్యాధుల నిర్మూలనలో పాలుపంచుకోవాలని డిప్యూటీ సీఎం కోరారు. ఉన్నత విద్య కళాశాలల ఆర్‌జేడీ డాక్టర్ బి.దర్జన్ మాట్లాడుతూ మైక్రోబయాలజీ కోర్సుకు ఎందో ప్రాధాన్యమున్నా.. సరైన ఫ్యాకల్టీ లేక చాలా కళాశాలల్లో కోర్సు ఎత్తివేస్తున్నారన్నారు.
వర్‌కషాప్‌లో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిస్ట్యూట్ అండ్ న్యూట్రిషన్ సీనియర్ సైంటిస్టు సుదర్శన్‌రావు కీలకోపన్యాసం చేస్తూ ఆహారం, నీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఇంకా కేడీసీ ప్రిన్సిపాల్ ఆర్.మార్తమ్మ, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్‌ఎం.రెడ్డి, వర్క్‌షాప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.సదాశివరెడ్డి, డాక్టర్ ఎన్‌వీఎన్‌చారి మాట్లాడిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమిరెడ్డి, వినోలియా మిల్కా, హిమబిందు, వాసం శ్రీనివాస్, సత్యనారాయణరావు, విష్ణుచరణ్, విక్టర్ సంజీవయ్య పాల్గొన్నారు. కాగా, తొలుత డిప్యూటీ సీఎం ఎన్‌సీసీ కేడెట్ల నుంచి గౌరవ వందన స్వీకరించగా, చివర్లో డిప్యూటీ సీఎం, సైంటిస్ట్ సుదర్శన్‌రావును నిర్వాహకులు సన్మానించారు.