ఆత్మకూర్ (ఎస్) : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో శుక్రవారం మధ్యాహ్నం వండిన భోజనం వికటించి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే పాఠశాలలో జూన్ 24వ తేదీన కూడా ఇలాగే జరిగి దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మోడల్ స్కూల్‌లో 364 మంది విద్యార్థులకు శుక్రవారం 360 మందికి సరిపడ భోజనం వండారు. భోజన సమయంలో ముందుగా 8,9,10వ తరగతి విద్యార్థులు మొదటగా భోజనం చేశారు.
కాసేపటి తర్వాత వాంతులు చేసుకోవడంతో మిగతావారు భోజనం వదిలేశారు. గమనించిన ఉపాధ్యాయులు విద్యార్థులను హుటాహుటిన విద్యార్థి సంఘాల సహకారంతో 108 అంబులెన్స్, ఆటోలో ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యమందించారు. వారిలో తీవ్రంగా అస్వస్థతకు గురైన ఎనిమిది మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం సూర్యాపేటకు తీసుకెళ్లారు.
ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని మండల వైద్యాధికారి కె.రామకృష్ణ తెలిపారు. ఇదిలావుండగా పాఠశాలలో వండిన సోరకాయ చెడిపోయిందని, కూరలో కారం అధికంగా వేయడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. గతంలో గతంలో అస్వస్థతకు లోనైనప్పుడు కూడా సోరకాయ కూరనే వడ్డించడంతో నాసిరకమైన కూరగాయలు వాడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
వికటించిన మధ్యాహ్న భోజనం
Published Sat, Aug 22 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM
Advertisement