మన రైల్వే గేట్లకాడ భద్రమేనా? | District, 200 kilometers off the track | Sakshi
Sakshi News home page

మన రైల్వే గేట్లకాడ భద్రమేనా?

Published Fri, Jul 25 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

మన రైల్వే గేట్లకాడ భద్రమేనా?

మన రైల్వే గేట్లకాడ భద్రమేనా?

  •  జిల్లా మీదుగా 200 కిలోమీటర్ల ట్రాక్   
  •  46 లెవల్ క్రాసింగ్ రైల్వే గేట్లు  
  •   డోర్నకల్-భద్రాచలం బ్రాంచ్ లైన్‌లో రెండు కాపలా లేని గేట్లు
  •   గేట్ల స్థానంలో వంతెనలు నిర్మిస్తామన్న రైల్వేశాఖ.. నేటికీ నెరవేరని హామీలు
  • కాజీపేట రూరల్/డోర్నకల్ : మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద గురువారం స్కూల్ బస్‌ను రైలు ఢీకొట్టిన ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. జిల్లా మీదుగా రెండు వందల కిలోమీటర్లకు పైగా రైలు మార్గం ఉంది. చెన్నై-న్యూఢిల్లీ గ్రాండ్‌ట్రంక్ మార్గం, బెంగళూరు-హైదరాబాద్-న్యూఢిల్లీ వంటి కీలక రైల్వే మార్గాలు జిల్లా మీదుగా వెళ్తున్నాయి. దాదాపు 200 రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. దీంతో మెదక్‌లోని మాసాయిపేటను పోలిన ప్రమాదకరమైన గేట్లు ఎక్కడైనా ఉన్నాయూ అన్న సందేహం జిల్లా వాసుల్లో వ్యక్తమైంది.

    జిల్లాలో 200 కిలోమీటర్ల పరిధిలో 46 రైల్వేగేట్లు ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు అన్ని చోట్లా కాపలాదారులు ఉన్నారు. కానీ రైల్వేగేట్ల తొలగింపులో భాగంగా చేపట్టిన పలు అండర్‌బ్రిడ్జి, ఓవర్‌బ్రిడ్జి నిర్మాణాలు ఆశించనంత వేగంగా జరగడం లేదు. ఆఖరికి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్, వరంగల్‌లో చేపట్టిన వంతెనల నిర్మాణం సైతం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది.

    మరోవైపు రైల్వే కాపలా లేని గేట్లు(అన్‌మ్యాన్‌డ్), కాపలా ఉన్న గేట్ల (మ్యాన్‌డ్) వద్ద అప్రమత్తంగా ఉండి వాహనాలు రైల్వే ట్రాక్‌ను జాగ్రత్తగా దాటించాలని, రైలు వస్తున్నప్పుడు వాహనాలను రైల్వే ట్రాక్‌పై నడిపించరాదని రైల్వేశాఖ పదే పదే చెప్పుతున్నా.. వాహనదారులు పెడచెవని పెడుతూ ప్రమాదాలను కోరి తెచ్చుకుంటున్నారు.  
     
    కాపలా ఉన్న గేట్లు 46
     
    కాజీపేట-పెంబర్తి మధ్య యశ్వంత్‌పూర్, జనగాం, రఘునాథ్‌పల్లి, ఇప్పగుడ, నష్కల్, పెండ్యాల, మడికొండ, అయోధ్యపురం, కాజీపేట డీజిల్ లోకోషెడ్, కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్ మధ్య 20 చోట్ల కాపలా ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్లు ఉన్నాయి. అదేవిధంగా దర్గా కాజీపేట-డోర్నకల్ స్టేషన్‌ల మధ్య 26 రైల్వే లెవెల్‌క్రాసింగ్ కాపలా ఉన్న గేట్లు ఉన్నాయి. గతంలో పెంబర్తి కాజీపేట వరకు ఉన్న కాపలా లేని గేట్లను.. పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.  

    అయితే మన జిల్లాలోని డోర్నకల్-ఖమ్మం జిల్లా భద్రాచలం బ్రాంచి లైన్‌లో పోచారం, కారేపల్లి వద్ద కాపలా లేని గేట్లు ఉన్నారు. కారేపల్లి రైలు మార్గంలోని ఎల్‌సీ-1 గేటు కాపలా లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. డోర్నకల్‌కు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఖమ్మం జిల్లా గార్ల మండలం పుల్లూరు, వస్రాంతండా మధ్యలో ఈ గేటు ఉంది. గేటుకు అవతలివైపు ఉన్న గార్ల, కారేపల్లి మండలాలకు చెందిన పుల్లూరు, కమలాపురం, గేటు కారేపల్లి, పాత కమలాపురం, దుబ్బతండా, నెమిలిపురి తదితర గ్రామాల నుంచి ఈ గేటు మీదుగా గార్ల, డోర్నకల్‌లకు రాకపోకలు సాగిస్తున్నారు.

    పలు గ్రామాలకు చెందిన విద్యార్థులతో కూడిన స్కూల్ బస్సు ఈ గేటు మీదుగా గార్లలోని ప్రై వేటు పాఠశాలకు వెళ్తుంది. ఎల్‌సీ నెంబర్ వన్ గేటు లెవల్ క్రాసింగ్ వద్ద రక్షణపరమైన కాపలా లేకపోవడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. రైల్వే అధికారులు స్పందించి ఎల్‌సీ గేటు వద్ద కాపలా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
     
    గేట్ల స్థానలంలో ఇంటర్‌లాకింగ్ సిస్టంలు
     
    రైల్వే అధికారులు కాజీపేట-విజయవాడ-బెల్లంపెల్లి, సికింద్రాబాద్ వరకు కొన్ని అన్‌మ్యాన్‌డ్, మ్యాన్‌డ్ గేట్ల వద్ద ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ లాకింగ్ సిస్టంలను ఏర్పాటు చేశారు. ఈ సిస్టం వలన రైలు వచ్చి వెళ్లే వరకు గేట్ తీయబడదు. అప్పటి వరకు వాహనాలు గేట్ వద్ద ఆగాల్సిందే. రైళ్ల ట్రాఫిక్ లేని సమయంలో వాహనాల కోసం ఈ గేట్లను తెరుస్తారు. రైల్వే అన్‌మ్యాన్‌డ్, మ్యాన్‌డ్ రైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు జరుగకుండా రైల్వే శాఖ భద్రత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

    గేట్లు ఉన్న చోట వాటి స్థానంలో ప్రజల సౌకర్యాల కోసం రోడ్ అండర్ బ్రిడ్జి లేదా రోడ్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని లేకుంటే రైల్వే గేట్ల వద్ద రైల్వే కార్మికులను కాపలా పెట్టాలని ప్రజలు అంటున్నారు. రైల్వే గేట్లపై ఎంపీలు స్పందించి రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించాలని కోరుతున్నారు. ఆయా ప్రాంత ఎంపీలు రైల్వే గేట్ల స్థానంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ అండర్ బ్రిడ్జి లేదా రోడ్ ఓవర్ బ్రిడ్జిలను రైల్వే ఫండ్, ఎంపీ ల్యాడ్స్‌ల నుంచి మంజూరు చేపించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
     
    మాటలు ఎక్కువ చేతలు తక్కువ..
     
    ప్రమాదాలకు నిలయంగా మారిన రైల్వే గేట్లపై పదేళ్లుగా రైల్వేశాఖ మాటల్లో చెప్పినంత వేగంగా చేతల్లో పనులు జరగడం లేదు. పదేశ్ల క్రితం రైల్వేమంత్రిగా కొనసాగిన లాలూప్రసాద్‌యాదవ్ దేశవ్యాప్తంగా కాపలాలేని గేట్లను ఎత్తివేసి వాటి స్థానంలో రోడ్ అండర్ బ్రిడ్జి లేదా రోడ్ ఒవర్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు. కానీ నేటికీ అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement